కబ్జా కేసులో టిడిపి ఎంఎల్‌ఎ బోండాకు షాక్‌

 విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ఎంఎల్‌ఎ బోండా ఉమామహేశ్వరరావుకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో స్వాతంత్య్ర సమరయోధునికి చెందిన సుమారు రూ.60 కోట్ల విలువైన 5.16 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొం టున్న వ్యవహారంలో బోండా ఉమాపైనా, అతని భార్య సుజాత, మరో 8 మందిపైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు నగర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను కూడా వేగవంతం చేయాలని ఆదేశించింది.

బాధితుల కథనం ప్రకారం విజయవాడ మొగల్రాజపురానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యనారాయణ స్వామికి ప్రభుత్వం 1952లో అజిత్‌సింగ్‌నగర్‌ సమీపంలో 10.16 ఎకరాల భూమిని కేటాయించింది. దీనిలో 5 ఎకరాల భూమిని అతని వారసులు విక్రయించుకున్నారు. మరో 5 ఎకరాల 16 సెంట్ల భూమిని విక్రయించకుండా ఉంచారు. విజయవాడ రాజధానిగా మారిన తర్వాత అక్కడ ఎకరం రూ.10 కోట్లకు పైగానే పలుకుతోంది. దీంతో ఆ భూమిపై ఎంఎల్‌ఎ బోండా ఉమామహేశ్వరరావు కన్నుపడింది. దానిని ఎలాగైనా దక్కించుకు నేందుకు పథకం రూపొందించారు.

తన ఆర్థిక అవసరాల రీత్యా అప్పుకోసం విజయవాడ 47వ డివిజన్‌ కార్పొరేటర్‌ మహేష్‌ వద్దకు వచ్చిన రామిరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తికి తనఖా రిజిస్ట్రేషన్‌ చేయించి అప్పు ఇప్పిస్తామని నమ్మబలికారు. అతడిని రిజిస్ట్రార్‌ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ ఎంఎల్‌ఎ బోండా అనుచరులు కోటేశ్వరరావుకే తెలియకుండా ఆయన పేరుతో స్వాతంత్య్ర సమరయోధుని భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆ తరువాత ఆ భూమిని సూర్యనారాయణ వర్మ అనే వ్యక్తికి విక్రయించినట్లు రాయించారు.

అనంతరం సూర్యనారాయణ వర్మ ద్వారా జిపి తీసుకుని ఆ భూమిలో కొంతభాగాన్ని ఎంఎల్‌ఎ భార్య బోండా సుజాతకు విక్రయించినట్లు రిజిస్ట్రేషన్‌ చేయించారు. మిగిలిన భాగాన్ని అతని అనుచరుల పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఈ తతంగం పూర్తయిన తరువాత కొంత భూమిలో వెంచర్లు వేసి వాటిని పలువురికి విక్రయించారు. ఈ మొత్తం భూకబ్జా వ్యవహారంలో రెవెన్యూ అధికారులు కూడా సహకరించారు. కబ్జా చేసిన స్థలంలో ఎంఎల్‌ఎ బోండా భార్య సుజాత ఓ ఫ్యాక్టరీని నిర్మించేందుకు సిద్ధం కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

నిర్మాణం గురించి తెలుసుకున్న స్వాతంత్య్ర సమరయోధుడు సూర్యనారాయణ మనవడు సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సిఐడి అధికారులు కోటేశ్వరరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. భయాందోళనకు గురైన అతడు ఈ వ్యవహారంలో తన పాత్రేమీలేదని, తనను ఎంఎల్‌ఎతోపాటు ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని అప్పటి నగర పోలీసు కమిషనర్‌ గౌతంసవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేశాడు. మొత్తం వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును మాత్రం మందకొడిగా సాగించారు.

కాగ ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారంలో ఎంఎల్‌ఎ బొండా దంపతులతో సహా 9 మందిపై చర్యలకు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎంఎల్‌ఎ బొండా ఉమామహేశ్వరరావు శాసనసభ సభ్యత్వాన్ని తక్షణం రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.   బోండా ఉమా అవినీతి అక్రమాలపై ఎన్నో ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా సమగ్ర విచారణకు సిఎం ఆదేశించాలని కోరారు.