తుపాకీ గుళ్లకు బదులుగా తుపాకీ గుళ్లే వస్తాయి

ఉగ్రవాదులు తుపాకీ గుళ్లు పేల్చి బదులుగా పూలగుత్తులు ఆశించొద్దని జమ్ము కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ స్పష్టం చేసారు. వారి ఆయుష్షు కూరగాయలు నిల్వచేసే కాలమంత ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు. జమ్ములో ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 40 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. రాళ్లు విసరడం, ఉగ్రవాదంలోకి యువకుల చేరిక తగ్గిందని ఆయన తెలిపారు.

‘ఇది చాలా తేలికైన సమీకరణం. తుపాకీ గుళ్లు పేలిస్తే తుపాకీ గుళ్లే తిరిగొస్తాయి. బదులుగా పూల గుత్తులు రావు కదా’ అని మాలిక్‌ ప్రశ్నించారు. ‘ఉగ్రవాదుల ఆయుష్షు చాలా తక్కువ. రాష్ట్రంలో పరిస్థితి సమాధి స్థితిలో ఏమీ లేదు. నేను పదవిలోకి వచ్చిన తర్వాత 40 ఉగ్రవాదుల్ని హతమార్చారు. రాళ్లు విసరడం తగ్గింది. ఉగ్రమూకల్లో యువత చేరడమూ తగ్గింది. పరిస్థితులు ప్రమాదకరంగా లేకపోవడం సంతృప్తికరం’ అని మాలిక్‌ పేర్కొన్నారు. ఆయన రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేవలం అధికారులతోనే కాకుండా స్థానిక ప్రజలతోనూ మాట్లాడారు.

‘ఇక్కడి వారితో మాట్లాడిన తర్వాత 13-20 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉందని అర్థమైంది. ఎందుకంటే వారు చాలా చిరాకులో ఉన్నారు. ఇక్కడి యువత కేవలం దిల్లీపైనే కాదు పాకిస్థాన్‌పైనా అసంతృప్తితో ఉంది. హురియత్‌ లాంటి స్థానిక పార్టీల సంగతీ అంతే. ఆశాకిరణం కనిపించడం లేదు. అందుకే వారితో మమేకమై వారి ఆకాంక్షల మేరకు పనిచేయాలి. అప్పుడే వారు కేంద్రం తమకు వ్యతిరేకంగా లేదని అర్థం చేసుకుంటారు’ అని పేర్కొన్నారు.

`చాలా మంది అక్షరాస్యులు చెడ్డ పనులు చేస్తుంటారు. మన్నన్‌ వని సంఘటనలు తప్పుడు సమాచారం వల్లే జరుగుతున్నాయి. ఈ దేశం గురించి అర్ధసత్యాలతో అక్కడి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎంతమంది ఉగ్రవాదులు ఉంటారిక్కడ? ఆ సంఖ్య 400 ఉండొచ్చేమో’ అని ఉన్నత విద్యార్హతలున్న ఉగ్రవాది మన్నన్‌ వని ఎన్‌కౌంటర్‌ను ఉద్దేశించి మాలిక్‌ తెలిపారు.

చంపాల్సింది ఉగ్రవాదులను కాదని ఉగ్రవాద భావజాలాన్ని అని మాలిక్‌ సూచించారు. ఉగ్రవాదం తుపాకీలోంచి రాదని మెదడులోంచి పుడుతుందని వెల్లడించారు. ఇక్కడి వారి మెదళ్లలో ఉగ్ర భావజాలం చెరిపివేసేందుకే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఎల్‌టీటీఈ లాంటి ఉగ్రవాద సంస్థల నుంచి సాధించిందేమిటి? కేవలం వినాశనం, మరణం తప్ప అని గుర్తు చేసారు. భారత్‌ను కాసేపు మరిచిపోండి, ప్రస్తుత ప్రపంచంలో ఒక చిన్నదేశాన్ని సైతం ముక్కలు చేయలేరు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆగస్టు 23న సత్యపాల్‌ మాలిక్‌ జమ్ము గవర్నర్‌గా పదవీ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.