కెసిఆర్ కు కేంద్రం షాక్ ... రూ.190 కోట్లు వాపస్

తాను ఎన్నికల సమయంలో చేసిన హామీలను అమలు పరచ వలసినది పోయి కనీసం కేంద్రం ఇస్తున్న నిధులను కుడా ఖర్చు పెట్టకుండా, ఎక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలలో అభిమానం పెరుగుతుందో అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చిన్నట్లు అయింది. రెండు పడకల గృహాలు కట్టిస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొంటూ ఏమీ చేయకుండా ఉదిపొయిన ప్రభుత్వం కనీసం పేద ప్రజలకు గృహ నిర్మాణం కోసం కేంద్రం ఇస్తున్న నిధులను కుడా ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో విఫలమైందని, ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద విడుదల చేసిన రూ.190కోట్లను వాపస్ చేయాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు నిర్మించేందుకు 2016-17 సంవత్సరానికిగాను కేంద్రం రాష్ట్రానికి రూ.190 కోట్లు విడుదల చేసింది.

ఈ నిధులతో నిర్మించిన ఇళ్ళ వివరాలను పంపించాలంటూ కేంద్రం చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. కేంద్ర ప్రభుత్వం 2016-17 సంవత్సరంలో తెలంగాణకు 70,674 ఇళ్లు కేటాయించి వీటి నిర్మాణానికి మొదటి విడత కింద రూ.190.78 కోట్లు విడుదల చేసింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన ఇళ్ళ వివరాలను పంపించాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినట్లు తెలిసింది.

 నిధులు విడుదల చేసి రెండేళ్లు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ళకు సంబంధించిన వివరాలను కేంద్రానికి పంపించలేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
అధికారులు చెబుతున్నారు. వివరాలను పంపించనందుకు రూ.190 కోట్లను కేంద్ర ఖజానాకు వెంటనే జమ చేయాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఇతర పథకాలకు జరిగే కేటాయింపుల నుండి తగ్గించుకుంటామని కూడా కేంద్రం టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి స్పష్టం చేసిందని అధికారులు అంటున్నారు.

ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన వివరాలు ‘ఆవాస్ సాఫ్ట్’ అనే ఆన్‌లైన్ పోర్టల్‌లో పొందుపరచవలసి ఉంటుంది. అయితే రెండేళ్లు గడుస్తున్నా ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన వివరాలు రాష్ట్రం అప్‌లోడ్ చేయటం లేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 2016-17 సంవత్సరానికి కేటాయించిన 70 వేల ఇళ్ళను కూడా ఇతర రాష్ట్రాలకు కేటాయించి ఇందుకు సంబంధించిన నిధులను ఆ రాష్ట్రాలకు ఇస్తామని వారు చెబుతున్నారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 2018-19 సంవత్సరంలోగా దేశం మొత్తంమీద కోటి ఇళ్ళను గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించవలసి ఉన్నది. కాగా పేదల ఇళ్ల నిర్మాణంలో తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలు అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరి మూలంగా తమ లక్ష్య సాధన కష్టమవుతోందని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణతోపాటు మరికొన్ని ఇతర రాష్ట్రాలకు కేటాయించిన ఇళ్ళను ఇప్పుడు సమర్థంగా అమలుచేస్తున్న రాష్ట్రాలకు కేటాయించటం ద్వారా తమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలను అప్‌లోడ్ చేయటంతోపాటు తమకు అధికారికంగా తెలియజేస్తే పరిస్థితిని చక్కదిద్దవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.