తెలుగు దేశంతో పొత్తు పట్ల రాహుల్ సానుకూలం !

కాంగ్రెస్ వ్యతిరేక పక్షంగా ఎన్టి రామారావు ఏర్పరచిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఎన్నికలలో అవగాహన ఏర్పరచుకోవడానికి రంగం సిద్దం అవుతున్నట్లు కనిపిస్తున్నది. రెండు రోజుల తన హైదరాబాద్ పర్యటన ముగింపు సందర్భంగా తెలుగుదేశం పార్టీతో పొత్తుపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందించడంతో ఈ అంశంపై కొంతకాలంగా వెలువడుతున్న కధనాలకు బలం చేకురిన్నట్లు అయింది.

పైగా రాహుల్ గాంధీ పాల్గొన్న యువపారిశ్రామిక వేత్తల సమావేశంలో సియం చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణి పాల్గొనడం ఆసక్తి కలిగిస్తున్నది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆహ్వానంపై ఆమె ఈ సమావేశంలో పాల్గొనడం గమనార్హం. ఆమె భర్త నారా లోకేష్ మామగారి మంత్రివర్గంలో ఉండటమే కాకుండా తెలుగు దేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజులలో రాహుల్ -చంద్రబాబు లమధ్య రాజకీయంగా మరింత సాన్నిహిత్యం పెరిగే అవకాశాలను ఆమె పాల్గొనడం స్పష్టం చేస్తున్నది.

చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణితోపాటు టిడిపి ఎంపీ టీజీ వెంకటేశ్‌ తనయుడు టీజీ భరత్, జేసీ తనయుడు పవన్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ వారసులు ఇద్దరు వచ్చే ఎన్నికలలో టిడిపి అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధపడుతుండటం గమనార్హం. దగ్గుబాటి సురేశ్‌తోపాటు టీడీపీ అనుకూల పారిశ్రామికవేత్తలు కూడా ఈ సమావేశానికి వచ్చారు.

 తెలంగాణ పర్యటనలో భాగంగా రెండో రోజు ఆయన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తులపై స్థానిక పీసీసీలదే తుది నిర్ణయమని ప్రకటించారు. ఈ విషయంలో స్థానిక నేతల నుంచి సూచనలొస్తే పరిశీలిస్తామన్నామని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ నేతల మధ్య సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుగుతున్నాయి. ఒంటరిగా పోటీచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రకటించడంతో టిడిపి, టి ఆర్ ఎస్ పొత్తు ఏర్పరచుకొవచ్చని గతంలో సాగిన ఉహాగానలకు తెరపడిన్నట్లు అయింది.

ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తాయని, బీహార్‌లో ఆర్జేడితో కలిసి పోటీ చేస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. 2019లో నరేంద్ర మోదీని ప్రధాని కాకుండా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెబుతూ యూపీఏ భాగస్వామ్యంతో పాటు అన్ని పార్టీలను కలుపుకుంటున్నామని తెలిపారు. 200 సీట్లు సొంతంగా వస్తేనే మోదీ ప్రధాని అవుతారని, యూపీ, బీహార్‌లో 120 సీట్లను కాంగ్రెస్‌ లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. విపక్షాలన్నీ కలిసి పోటీ చేస్తే మోదీ ప్రధాని అయ్యే అవకాశం లేదని స్పష్టం చేసారు.

తెలంగాణలో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. ఆంధ్ర ప్రదేశ్ లో కుడా పరిస్థితి మెరుగవుతుందని అన్నారు. అయితే ఎట్లాగో చెప్పనే లేదు. అయితే బిజెపి ఓటమి చెందితే ప్రధానమంత్రి ఎవ్వరనే అంశంపై నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు.