కాంగ్రెస్‌ను కాపాడాలని చంద్రబాబు వృధాయత్నం : రాజనాథ్

వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్‌ను కాపాడాలనే చంద్రబాబు వృద్దా ప్రయత్నం చేస్తున్నారని అంటూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ నిరర్థక ఆస్తిగా మారిందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయ నూతన భవన శంకుస్థాపన సందర్భంగా గుంటూరులో జరిగిన బహిరంగసభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఉచ్చులో టీడీపీ చిక్కుకుందని చెబుతూ కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర తెలుసుకుంటే మంచిదని హితవు చెప్పారు.

రాష్ట్రాభివృద్ధికి తాము సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వమే సహకరించటం లేదని విచారం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబునైదుకు రాష్ట్ర ప్రయోజనాలకన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీని తీసుకోవడానికి అంగీకరించి సంతకాలు కూడా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ‘యూటర్న్‌’ తీసుకుని ప్రత్యేక హోదా అంటూ గోల చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీపై ప్రధానికి చంద్రబాబు ఎన్నిసార్లు అభినందనలు తెలిపారో ప్రజలందరికీ తెలుసని గుర్తు చేశారు.

ఒకపక్క ప్రత్యేక ప్యాకేజీ నిధులు పొందుతూనే ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నాయకులు మరోపక్క ధర్మపోరాటాల పేరుతో ప్రత్యేక హోదా.. ప్రత్యేక హోదా అంటూ కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. ప్రత్యేక హోదా నినాదం పేరుతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ద్వజమెత్తారు. హోదా పేరుతో రాజకీయాలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని విస్మరిస్తున్నారని ద్వజమెత్తారు. చంద్రబాబు తీరును రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలని కేంద్ర మంత్రి కోరారు.  

చంద్రబాబు ప్రత్యేక హోదా అనే ఒక పదం పట్టుకొని 2016లో ఒక మాట, 2017లో ఇంకో మాట, ఇప్పుడు మరోమాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ, ప్రధానమంత్రి అవాస్‌యోజన పథకాల్లో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎక్కువ నిధులు మంజూరు చేస్తోందని గుర్తు చేసారు.

తెలుగుదేశం ఎన్డీయేను వీడినా ఆంధ్రప్రదేశ్‌ పట్ల వివక్ష చూపబోమని కేంద్ర హోంమంత్రి భరోసా ఇచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను చిత్తశుద్ధితో అమలు చేస్తామని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీనిచ్చారు.

ఏపీని తాము ప్రత్యేక దృష్టితోనే చూస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేసారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఇప్పటికే రూ.8 వేల కోట్ల సాయమందించామని, ఇంకా రూ 22 వేల కోట్ల విలువ ప్రాజెక్టులు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటే వాటిపై దృష్టి పెట్టకుండా ప్రత్యేకహోదా అంటూ ఆందోళనలు చేయడం తగదని హితవు చెప్పారు. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టుకు ఇవ్వనన్ని నిధులు రూ.6761 కోట్లు పోలవరానికి ఇచ్చామని తెలిపారు. 14వ ఆర్థికసంఘం రూ.22 వేల కోట్ల ఆర్థిక లోటును అంచనావేయగా, ఇప్పటికే రూ.15,600 కోట్లు ఇచ్చామని చెప్పారు.

తిత్లీ తుపాను నష్ట నివేదికలు అందగానే సాయం చేస్తామని రాజనాథ్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో నలుగురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి ఉన్నారని చెబుతూ  ఈసారి ఈ సంఖ్య రెట్టింపు కావాలని రాష్ట్రంలోని బిజెపి నేతలకు హితవు చెప్పారు.

 ప్రధాని దేశ ప్రజలందరికీ ప్రతినిధి అని, అలాంటి వ్యక్తిపై కాంగ్రెస్‌ వ్యక్తిగత విమర్శలకు దిగటం బాధాకరమని రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల మావోల దాడిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల భూములను టిడిపి నేతలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. అన్నం పెట్టిన చేతులను నరికే సంస్కృతి చంద్రబాబుదని అంటూ కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం రోజూ బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిన రూ.1.30 లక్షల కోట్లు, ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బులను చంద్రబాబు, ఆయన కుమారుడు కొట్టేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.