తిత్లీ తక్షణ సాయంగా రూ 1200 కోట్లు కోరిన చంద్రబాబు

తిత్లీ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో రూ 3435 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి రూ 1200 కోట్ల తక్షణ సాయంగా అందించాలని కోరారు. అదే విధంగా విభజన హామీలు అమలు చేయాలని కూడా కోరారు.

ఈ మేరకు రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కూడిన బృందం గన్నవరం విమానాశ్రయంలో మంగళవారం రాత్రి కేంద్ర మంత్రిని కలిసి ముఖ్యమంత్రి రాసిన లేఖలను అందచేశారు. 872 గ్రామాల్లో విద్యుత్ వ్యవస్థ పాడైందని, 1.64 లక్షల హెక్టార్ల మేరకు పంటలు ధ్వంసమైనాయని తెలిపారు. విద్యుత్ రంగానికి రూ 505 కోట్లు, రహదారులకు రూ 406 కోట్లు, హార్టికల్చర్‌కు రూ 1000 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ 100 కోట్లు, గృహా నిర్మాణ శాఖకు రూ 220 కోట్లు నష్టం జరిగిందని తెలిపారు.

 తుపాను సహాయ చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ 500 కోట్లు ఖర్చు చేసిందని ఆ లేఖలో తెలిపారు. కేంద్రం నుంచి తక్షణ సహాయం రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 2 లక్షల మంది ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. గతంలో హుదూద్ తుపాను సమయంలో ప్రధాని మోదీ రూ 1000 కోట్లు విడుదల చేసేందుకు హామీ ఇచ్చి, రూ 551 కోట్లు మాత్రమె విడుదల చేశారని ఈ సందర్భంగా  గుర్తు చేశారు. మరో రూ 926 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు.

ఇప్పటి వరకూ తుపాను ప్రభావిత ప్రాంతంలో కేంద్రం నుంచి ఎవరూ పర్యటించలేదని తెలిపారు. ఈ రెండు జిల్లాల్లో సాధారణ పరిస్థితి తీసుకువచ్చేందుకు వీలుగా నిధులు కేటాయించాలని కోరారు. రాజ్‌నాథ్‌ను కలిసిన అనంతరం మంత్రులు సోమిరెడ్డి, దేవినేని తుపాను సాయం అందించే విషయంపై రాజ్‌నాథ్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు.