జనాలపై వరాల జల్లు కురిపించిన కెసిఆర్

ముందస్తు ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ జనాలపై వరాల జల్లు కురిపించింది. రైతులకు రూ. లక్ష లోపు రుణమాఫీ అమలు.. కొత్తగా నిరుద్యోగ భృతి వంటి కీలకమైన హామీలను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పాక్షిక మేనిఫెస్టో పేరుతో ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగానే మంగళవారం పలు కీలక హామీలను ప్రకటించారు. రైతుబంధు పథకం కింద ఇచ్చే సాయాన్ని ఎకరానికి రూ. 8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతామని వెల్లడించారు. ఆసరా పింఛన్ల మొత్తాన్ని పెంచుతున్నామని, వాటిని పొందేందుకు వయో పరిమితిని 65 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామని తెలిపారు.

మహిళా సంఘాల ద్వారా ప్రతీ నియోజకవర్గంలో లిజ్జత్‌ పాపడ్‌ తరహాలో ఆహారశుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సమన్వయ సమితులకు గౌరవభృతి ఇస్తామన్నారు. రెండు పడక గదుల ఇళ్ల పథకాన్ని కొనసాగిస్తూనే ఎవరికైనా సొంత స్థలంలో ఇల్లు కావాలంటే కట్టిస్తామని, లేదు వారే కట్టుకుంటానంటే సాయం అందిస్తామని తెలిపారు.

 రూ. 2,000 కోట్లతో పంటల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు సముచిత రీతిలో మధ్యంతర భృతి, చిరుద్యోగులకు వేతనాల పెంపు, ఎస్సీ, ఎస్టీలకు రూ. 25,000 కోట్లతో ప్రత్యేక పథకాలను ప్రవేశపెడతామని, రెడ్డిలకు, ఆర్య వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్‌ నుంచి వీటిని అమలు చేస్తామని స్పష్టం చేసారు. ఇవి కొన్ని కీలక నిర్ణయాలు మాత్రమేనని, తుది ప్రణాళికలో మరిన్ని ముఖ్యమైన నిర్ణయాలుంటాయని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో భవన్‌లో కె.కేశవరావు అధ్యక్షతన జరిగిన ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం అనంతరం ఆయన నిర్ణయాలు ప్రకటించారు.

ఈ పథకం విధివిధానాల రూపకల్పన కోసం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసినట్లు కెసిఆర్ వివరించారు. అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చిరు ఉద్యోగులకు మరింత వేతనాలు పెంచుతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ మెరుగ్గా ఉంటుందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగుల ప్రెండ్లీగా ఉంటుందన్నారు.

2021 జూన్‌ వరకు రాష్ట్రంలో కచ్చితంగా కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తాం. కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు, డిండి వంటి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. రైతులు అప్పుల నుంచి బయటపడి, పెట్టుబడి ఖర్చులను వారే భరించే స్థితికి రావాలి. రాష్ట్రంలో 45.50 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. వీరిలో రూ.లక్ష లోపు రుణాలున్న వారు 42 లక్షల మంది ఉన్నారు. అందుకే రూ.లక్ష రుణ మాఫీని మరోసారి అమలు చేయాలని నిర్ణయించామని వివరించారు.

మహిళా సంఘాల బృందాల ఆధ్వర్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ముంబైలోని లుసిడ్‌ పాపడ్‌ ఇదే తరహాలో మొదలైంది. ఇప్పుడు ఆ పాపడ్‌ దేశ వ్యాప్తంగా అన్ని హోటళ్లలో ఉంటుంది. ఏకంగా రూ.1,100 కోట్ల టర్నోవర్‌తో ఈ సంస్థ నడుస్తోందని చెప్పుకొచ్చారు.