మోదీకి భయపడే ముందస్తుకు వెళ్లుతున్న కెసిఆర్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంటే తెలంగాణ ఆపధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భయమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ ఎన్నికల ఇన్‌చార్జ్ జయ ప్రకాశ్ నడ్డా ఎద్దేవా చేసారు.  ఆ భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీలతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జమిలీ ఎన్నికలకు అంగీకరించిన కేసీఆర్ హఠాత్తుగా శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు.

ముందస్తు ఎన్నికలపై మహబూబ్‌నగర్, కరీంనగర్ సభల్లో అమిత్ షా ప్రశ్నించినా ఇప్పటివరకూ కేసీఆర్ సరైన సమాధానమివ్వలేదని గుర్తు చేసారు. ముందస్తుకు వెళ్లకపోతే మోదీ చరిష్మా, పాలన ముందు టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని బయపడ్డారని చెప్పారు. కోర్టుల్లో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు (పిల్స్) వేసినంత మాత్రానా సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై కూడా కోర్టుల్లో అనేక పిల్స్ వేశారని, మేము ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామా? అని నిలదీశారు.  

పాలనలో కేసీఆర్ పూర్తిగా వైఫల్యం చెందారని, అభివృద్ధి కుంటుపడి. అవినీతి పెరిగిపోయిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ద్వజమెత్తారు. కేసీఆర్ మాటలు.. ఆయన పిచ్చి పాలనకు అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిగా, యువత కోపంతో ఉన్నారని దుయ్యబట్టారు. వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం కేసీఆర్ పాలన వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో సమాధానం చెప్పగలరా? అంటూ కేసీఆర్‌ను నిలదీశారు. 

కేవలం రాజకీయ కారణాలతో పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’ కార్యక్రమంలో కేసీఆర్ భాగస్వామ్యం కాలేదని నడ్డా ఆరోపించారు. ఏటా రూ.172 కోట్లను అందించడానికి ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంద్న కారణంతో కేసీఆర్ ముందుకు రాలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు.

బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధమైందని, ఎన్నికలు జరిగిన అనంతరం పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కేసీఆర్‌ స్వలాభం కోసం, మోదీకి పేరొస్తుందన్న రాజకీయ కారణాలతో కేంద్ర పథకాలను ప్రజలకు చేరకుండా చేశారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి పారదర్శక పాలన అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేసారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రానికి కేంద్ర పథకాలు అందుతాయని తెలిపారు. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ చిత్తశుద్ధిని గమనించిన డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో ప్రజలు మద్దతు పలుకుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు.