కేరళలో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘సేవ్ శబరిమల’ ఉద్యమం

కేరళలో ‘సేవ్ శబరిమల’ ఉద్యమం ప్రకంపనలు సృష్టిస్తోంది. శబరిమల ఆలయంలోని మహిళకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా అన్ని వయసుల మహిళలూ సోమవారం రోడ్లపైకి వచ్చి నినదించారు. బీజేపీ నాయకత్వంలో రాజధాని తిరువనంతపురంలో భారీ ర్యాలీ జరిగింది. రోజురోజుకూ ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతరూపం దాలుస్తున్నాయి. శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల అమలును వ్యతిరేకిస్తూ కేరళలో వేల మంది బీజేపీ కార్యకర్తలు, అయ్యప్ప భక్తులు రాజధాని ఈ భారీ ప్రదర్శనలో పాల్గొన్నారు.

అయ్యప్ప స్వామి చిత్రపటాలు, ప్లకార్డులు పట్టుకుని సేవ్ శబరిమల పేరుతో మహిళలు, చిన్నారులతో కలిసి కదం తొక్కారు. సుప్రీంకోర్టు తీర్పుపై సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం సత్వరమే సమీక్షకు వెళ్లాలని నినాదాలతో హోరెత్తించారు.

కాగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వివిధ వర్గాలతో మంగళవారం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయప్ప ఆలయ తంత్రీ(ప్రధాన పూజారి) కుటుంబం, పండాలం రాయల్స్, అయ్యప్ప సేవాసంఘం సమావేశానికి హాజరవుతుంది. నవంబర్ 17 నుంచి జరిగే మండలం మకరవిలక్కు వార్షిక ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనితోపాటు మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. నెలవారీ పూజల నిమిత్తం బుధవారం ఆలయాన్ని తెరుస్తారు.

మరోపక్క సుప్రీం తీర్పును అమలుచేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన మారథాన్ కొనసాగుతోంది. అయ్యప్ప భక్తుల విశ్వాసాలను కాపాడాలని, ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాదయాత్ర సాగుతోంది. లక్షలాది ప్రజల మనోభవాలను కాదని, కోర్టు తీర్పును అమలుచేయాలన్న వాపమక్ష ప్రభుత్వం నిర్ణయంపై బీజేపీ నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన భక్తులు మూడు నెలలపాటు జరిగే అయ్యప్ప పూజలకు హాజరవుతుంటారని బీజేపీ ఎంపీ సురేష్ గోపీ తెలిపారు.

సోమవారం నాటి ర్యాలీకి భారతీయ ధర్మ జనసేన చీఫ్ తుషార్ వెల్లప్పల్లె, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై నాయకత్వం వహించారు. ప్రజల సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పిళ్లై ఆరోపించారు. ‘రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి వెళ్తాం. ఇంటింటినీ దర్శిస్తాం. మా ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరతాం. అయ్యప్ప స్వామి ఆలయం పవిత్రను కాపాడేందుకు చేపట్టిన ఉద్యమంలో భాగస్వాములు కావాలని అభ్యర్థిస్తా’అని ఆయన వెల్లడించారు.

వందల ఏండ్ల చరిత్ర కల దేవాలయ పవిత్రత, ఆచార, సంప్రదాయాలకు భంగం కలిగించేందుకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ద్వజమెత్తారు. కోట్ల మంది అయ్యప్ప భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తే సహించేదిలేదని, ఆలయంలోకి మహిళలు ప్రవేశించకుండా ప్రవేశద్వారాల వద్ద నేలపై పడుకుని అడ్డుకుంటామని స్పష్టం చేసారు. ఈ సమస్యను 24 గంటల్లోగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే ఉద్యమం విస్తృతం చేసి, గ్రామస్థాయిలో అందరినీ భాగస్వాముల్ని చేస్తామని అల్టిమేటం ఇచ్చారు.

మరోపక్క నెలవారీ పూజలు ‘తులం’ నిమిత్తం శబరిమల ఆలయాన్ని ఈనెల 17న తెరుస్తారు. ఐదురోజుల పాటు పూజలు నిర్వహించిన తరువాత 22న మూసివేస్తారు. శబరిమల ఉద్యమం  తారస్థాయికి చేరుకోవడంతో రాజధానిలో భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. బీజేపీ పాదయాత్ర జరిగే మార్గంలోనూ బందోబస్తు పెంచారు. సెప్టెంబర్ 28న ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆలయ ప్రవేశానికి అనుకూలంగా తీర్పును వెలువరించినప్పటి నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి.