పరిపూర్ణానంద స్వామిపై ఆంక్షలను ఎత్తివేయాలి

పరిపూర్ణానంద స్వామిపై హైదరాబాద్  నగర బహిష్కరణ ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి, పలు హిందూ సంస్థల నేతలు హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, శాసనమండలి బీజేపీ పక్ష నేత ఎన్ రామచందర్‌రావు, వీహెచ్‌పీ నేతలు , బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల చంద్రశేఖరరావులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించి, సాయంత్రం వారిని విడుదల చేశారు

ఈ సందర్భగా దత్తాత్రేయ మాట్లాడుతూ పరిపూర్ణానంద స్వామిని అరెస్టు చేసి నగర బషిష్కరణ విధించి నెల రోజులు గడచినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని విరుచుకు పడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా తీసుకున్న నిర్ణయంపై గవర్నర్‌కు విన్నవించినా కదలిక లేదని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆయన చెప్పారు.

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రభుత్వ నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తోందని ద్వజమెత్తారు. సామాజిక సమరసతను చెడగొట్టి అసాంఘిక శక్తులతో సమానంగా స్వామీజీని నగర బహిష్కరణ చేయడం ఎంత వరకూ సమంజసమని నిలదీశారు.

మరో వైపు మజ్లీసు నాయకులూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ తీవ్రవాదులకు అనుకూలంగా వ్యవహరిస్తూ వారితో స్నేహం చేస్తూ బుజ్జగింపు ధోరణితో వ్యవహరిస్తూ జాతీయవాద శక్తులను , దేశభక్తులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇది ప్రభుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనమని అంటూ ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి వెంటనే పరిపూర్ణానంద స్వామిపై నగర బహిష్కరణ ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు.