అరుదైన రికార్డు సొంతం చేసుకోబోతున్న హరీష్ రావు

మంత్రి టి హరీశ్‌రావు ఈ ఎన్నికలతో అరుదైన రికార్డు సొంతం చేసుకోబోతున్నారు. ఆయన ఏడోసారి ఎమ్మెల్యే ఎన్నికల బరిలో నిలిచారు. ఈసారి గెలిస్తే దేశంలోనే అత్యంత పిన్నవయసులో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 46 ఏండ్లు.

గతంలో ఈ రికార్డు కేరళకు చెందిన కేఎం మణి పేరుమీద ఉన్నది. ఆయన 49 ఏండ్ల వయసులో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాబోయే ఎన్నికలతో హరీశ్‌రావు ఈ రికార్డును తిరుగ రాయనున్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎనిమిదోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఆయన 50 ఏండ్ల వయసులో ఆరోసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.

కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, దివంగత నేత బాగారెడ్డి ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారు వరుసగా 63, 53 ఏండ్ల వయసులో ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
దేశంలో అత్యధికసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణానిధి, కేరళకు చెందిన కాంగ్రెస్ నేత కేఎం మణి పేరుమీద ఉన్నది. వారిద్దరూ 13సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఏకంగా ఆరు దశాబ్దాలకుపైగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కరుణానిధి 56వ యేట, మణి 49వ యేట ఆరోసారి ఎమ్మెల్యే అయ్యారు.

ఆ తర్వాత స్థానం బెంగాల్ మాజీ సీఎం దివంగత జ్యోతిబసుది. వరుసగా 23 ఏండ్లపాటు సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించిన బసు 11 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 56 ఏండ్ల వయసులో ఆరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మహారాష్ట్రకు చెందిన గణ్‌పాత్రో దేశ్‌ముఖ్ సైతం 11 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జ్యోతిబసు సరసన నిలిచారు. ఆయన 50వ ఏట ఆరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.

లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే మహారాష్ట్రలోని గుల్బర్గా నియోజకవర్గం నుంచి 1972-2009 వరకు వరుసగా తొమ్మిదిసార్లు ఎన్నికయ్యారు. ఆయన 52వ ఏట ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.