చమురు ధరల్ని తగ్గించాల్సిందే : ప్రధాని మోదీ

అధిక ఇంధన ధరలు ప్రపంచ జీడీపీనే ప్రమాదంలో పడేస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల బడ్జెటే తలకిందులు అవుతున్నదని ఆవేదన వెలిబుచ్చారు. ఈ విపత్కర పరిస్థితులు ఇలాగే కొనసాగితే అంతర్జాతీయ వృద్ధిరేటుకు విఘాతమేనని హెచ్చరించారు.

ఢిల్లీలో దేశ, విదేశాలకు చెందిన చమురు, గ్యాస్ రంగాల నిపుణులు, ఆయా సంస్థల సీఈవోలతో జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ సౌదీ అరేబియా తదితర చమురు ఉత్పాదక దేశాలు ముడి చమురు ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. విదేశాల నుంచి ముడి చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న భారత్ వంటి దేశాలపై అధిక ధరలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ రిటైల్ ధరలు రికార్డు స్థాయిలకు చేరాయని గుర్తుచేశారు.

దీంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నదని, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం మధ్య భారమైన ముడి చమురు దిగుమతులు.. కరెంట్ ఖాతా లోటును ఎగదోస్తున్నాయని పేర్కొన్నారు. వాహనదారులు ముఖ్యంగా సామాన్యుడి జీవనాన్ని పెరుగుతున్న పెట్రో ధరలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయన్న ఆయన వినియోగదారుల (చమురు దిగుమతి దేశాలు)కు కొత్తకొత్త ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నాయని, వారి బాధను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చమురు ఉత్పాదక దేశాలకు హితవు పలికారు.

రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్‌లతోపాటు బ్రిటీష్ పెట్రోలియం, టోటల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, వేదాంత, ప్రపంచ బ్యాంక్, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, గాజ్‌ప్రోమ్, ఇంటర్నేషనల్ గ్యాస్ యూనియన్, అమెరికన్ గ్యాస్ అసోసియేషన్, సౌదీ ఆరామ్కో, అడ్నాక్, రాస్‌నెఫ్ట్, ఐహెచ్‌ఎస్ మార్కిట్, ఐఈఏ ప్రతినిధులు పాల్గొన్నారు.

ముడి చమురు ధరల్లో స్థిరత్వం లోపించిన వేళ చమురు ఉత్పాదక దేశాలు, చమురు దిగుమతి దేశాలు భాగస్వామ్యంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే చేతులు కలుపుదాం రండంటూ పిలుపునిచ్చారు. క్రూడాయిల్ ఉత్పాదక దేశాలు, దిగుమతి దేశాలు కలిస్తే ప్రపంచ వృద్ధిరేటు మళ్లీ నిలకడను సంతరించుకోగలదని చెప్పారు.

నిజానికి ఆయిల్, గ్యాస్ మార్కెట్‌లో వినియోగపరంగా భారత్ కీలకపాత్ర పోషిస్తున్నదని, అయితే పరిమాణంలో, ధరల విషయంలో మార్కెట్‌ను శాసిస్తున్నది మాత్రం ఉత్పాదక దేశాలేనని గుర్తు చేసారు. ఇది సరికాదన్న ఆయన పరస్పర భాగస్వామ్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసారు .  

కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయికి పతనమవుతున్న విషయం తెలిసిందే. ఇతర దేశాల కరెన్సీల విలువ కూడా క్షీణిస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో చమురు దిగుమతులపై చెల్లింపుల్లో డాలర్లకు బదులుగా ఆయా దేశాల స్థానిక కరెన్సీని అంగీకరించే విషయంపై సమీక్షించాలని, దీనివల్ల భారత్ వంటి చమురు దిగుమతి దేశాలకు గొప్ప ఊరట లభించగలదని మోదీ అభిప్రాయపడ్డారు.

తాజా సమావేశంలో భారత్‌లో కొత్త పెట్టుబడులేవీ? అంటూ గ్లోబల్ కంపెనీల సీఈవోలను ప్రధాని మోదీ అడిగారు. గతంలో మీరు చేసిన సూచనలన్నింటినీ తమ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, అయినప్పటికీ చమురు, గ్యాస్ ఉత్పాదక, అన్వేషణ రంగాల్లో కొత్తగా పెట్టుబడులు రావట్లేదని ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. పెట్టుబడులు తగ్గడానికి గల కారణాలను ఆయా సంస్థల సీఈవోల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

సమావేశంలో మాట్లాడిన సౌదీ అరేబియా చమురు మంత్రి ఖాలిద్ ‘చమురు ధరలపై అన్ని దేశాల ఆందోళనలను మేం విన్నాం. ముఖ్యంగా వినియోగదారులకు కలుగుతున్న ఇబ్బందుల గురించి మోదీ మాట్లాడారు’అని తెలిపారు. ఇప్పటికే సౌదీ అరేబియా ఇందుకు సంబంధించి అనేక నిరోధక చర్యలు తీసుకుందని లేనిపక్షంలో ముడిచమురు ధరలు మరింతగా పెరిగిపోయి ఉండేవని పేర్కొన్నారు. చమురు వినియోగదారులు తమకు అత్యంత కీలకమని వారిని దూరం చేసుకోవడం ఎవరికీ తగదని ఖాలిద్ స్పష్టం చేసారు.