మిజోరాంలో బిజెపి పాగా వేస్తుందా !

ఈశాన్య భారత్ లోని రాష్త్రాలలో బిజెపి అధికారంలో లేనిది కేవలం మిజోరాంలో మాత్రమె. దేశం మొత్తం మీద కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు, నాలుగు రాష్ట్రాలలో మిజోరాం ఒకటి కావడం గమనార్హం. అందుకనే ప్రస్తుతం అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఎట్లాగైనా తమ కూటమి అధికారంలోకి రావాలని బిజెపి ప్రయత్నం చేస్తుంటే, అధికారం నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ చాల తపన చెందుతున్నది.

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరంలో నవంబర్ నెలలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌కు, బిజెపి ఆధర్యంలోని నార్త్ ఈస్ట్ డెవలప్‌మెంట్ అలయెన్స్ (ఎన్‌ఈడీఏ) మధ్య పోటీ హోరా హోరీగా జరగనుంది. బిజెపి ఏర్పాటు చేసిన ఈ కూటమిలో బలమైన ప్రతిపక్ష పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ చేరింది. 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన లాల్ తాన్హావ్లా ముఖ్యమంత్రిగా ఉన్నారు.

1972 వరకు అసోంలో భాగంగా మిజోరం ఉండేది. అనంతరం మిజోరాంను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 1987లో 53వ రాజ్యాంగ సవరణ ద్వారా 23వ రాష్ట్రంగా మిజోరం అవతరించింది. మిజోరం జనాభా 10.91 లక్షలు. ఇక్కడ 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 21,087 చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న ఈ రాష్ట్రంలో 91 శాతం అడవులు ఉన్నాయి. బంగ్లాదేశ్, మియాన్మార్‌తో 722 చ.కిమీ సరిహద్దును కలిగి ఉంది. మిజోరం రాజధాని పేరు అజ్వాల్. ఈ రాష్ట్రంలో 87 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. 20 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువున ఉన్నారు.

మిజోరం పేరుకు చిన్న రాష్టమ్రైనా రాజకీయ చైతన్యం ఎక్కువ. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన హోంశాఖ మంత్రి లాల్జీర్‌లైనా ఇటీవల ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి ప్రతిపక్ష పార్టీ మిజోనేషనల్ ఫ్రంట్‌లో చేరారు. అభివృద్ధి అజెండాగా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. మిజో నేషనల్ ఫ్రంట్ నేతృత్వంలో బీజేపీ ఎన్‌ఈడీఏ కూటమిని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ గుండెల్లో రైళ్లుపరుగెత్తుతున్నాయి. పైగా అధికార పార్టీకి చెందిన నేత లాల్జీర్‌లైనా ఈ కూటమిలోకి రావడంతో విపక్ష పార్టీల్లో ఉత్సాహంగా ఉన్నాయ.

పదేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. గత ఏడాది రెండు సార్లు ప్రధాని నరేంద్రమోదీ పర్యటించారు.