గిరిజనుడైనందునే షోకాజ్‌ నోటీసు లేకుండా సస్పెండ్ చేసారు

తాను గిరిజనుడైనందు వల్లే కనీసం షోకాజ్‌ నోటీసు కూడా ఇవ్వకుండానే పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ మండిపడ్డారు. గిరిజనులకు రిజర్వేషన్‌ కోరినందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారా? అని నిలదీశారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ వెంబడి ఉండే తెలంగాణ ద్రోహులు.. ఆనాడు తెలంగాణ గురించి మాట్లాడని వాళ్లు కేబినెట్‌లో ఉన్నారని విమర్శించారు. ఒక దశలో ఆయన తీవ్ర ఉద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

టీఆర్ఎస్‌లో ప్రజాస్వామ్యం, ఆత్మగౌరవం లేదని, అదో ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీగా తయారైపోయిందని దుయ్యబట్టారు. గిరిజనులకు భూమి ఇస్తామన్నారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. దళితులకు కూడా భూమి ఇవ్వమంటే ఇవ్వట్లేదన్నారు. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని ఉద్యమం సమయంలో కేసీఆర్‌ గతంలో హామీ ఇచ్చారని, ఆ హామీ ఇప్పుడేమైందని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు.. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.. అదేమైంది? అంటూ నిలదీశారు.

మైదాన ప్రాంతంలో ఐటీడీఏలు పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పి ఏర్పాటు చేయలేదని దుయ్యబట్టారు. గిరిజన ఐఏఎస్‌లకు కీలక పదవులు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. గిరిజనులంటే టీఆర్ఎస్‌ ప్రభుత్వానికి చిన్నచూపు ఉందని ఆరోపించారు. డీఎస్సీ నిర్వహించమంటే పట్టించుకోలేదని, గిరిజన నిరుద్యోగులకు న్యాయం జరగలేదని చెప్పారు. డి. శ్రీనివాస్‌, కొండా సురేఖను సస్పెండ్‌ చేయాలని అందరూ కోరితే చేయలేదు గానీ షోకాజ్‌ నోటీసులు ఇవ్వకుండానే తనను సస్పెండ్‌ చేశారని వాపోయారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని నాయక్ హెచ్చరించారు. ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలే కాదు పదో తరగతి పాసైన వేలాదిమందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆయనదే అని కొనియాడారు. తెలంగాణలో ఈ రోజు చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. గిరిజన నాయకులు, మేధావులతో చర్చించాకే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టంచేశారు. తనలా పార్టీలో చాలామంది ఉన్నారని, వారంతా త్వరలోనే టీఆర్ఎస్ నుంచి బయటకొస్తారని తెలిపారు.

మరోవైపు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున రాములు నాయక్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు టీఆర్ఎస్‌ ప్రకటించింది. రాములు నాయక్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.