చంద్రబాబుపై బిజెపి చార్జిషీటు

నవ్యాంధ్రలో చంద్రబాబునాయుడు పరిపాలనలో కింది నుంచి పైస్థాయి వరకూ చోటు చేసుకున్న అవినీతిపై త్వరలోనే ఛార్జిషీట్ తెస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీ మురళీధరరావు విశాఖపట్నంలో ప్రకటించారు. అవినీతికి అంతే లేకుండా పోయిందని, అన్ని రంగాల్లోనూ అవినీతి పెచ్చుమీరిందని ధ్వజమెత్తారు. కేంద్ర పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తనవిగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటోందని చెబుతూ  దీనిపై బీజేపీ పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కలిగిస్తోందని తెలిపారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతమొందించాలన్నలక్ష్యంతో టీడీపీ ఆవిర్భవించిందని గుర్తు చేస్తూ దీనిలో భాగంగానే గత ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీల కూటమిలో టీడీపీని కలుపుకున్నామని మురళీధర రావు వెల్లడించారు. అయితే రాజకీయ లబ్ధి కోసం టీడీపీ బీజేపీ నుంచి వేరుపడి కాంగ్రెస్‌తో జతకట్టేందుకు సిద్ధ పడుతోందని విమర్శించారు. ఇది తెలుగు ప్రజలను తీవ్రంగా కలచివేస్తోందని స్పష్టం చేసారు.

సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన చంద్రబాబు రాజకీయ అవగాహన లేని రాహుల్ గాంధీ నాయకత్వంలో నడవాలనుకోవడం దారుణమని ఎద్దేవా చేసారు. పూర్తి అవినీతి మయమైన కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టడం, రాజకీయ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చీకటి అధ్యాయంగా ఆయన పేర్కొన్నారు.

ఇక జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) అంశాన్ని కాంగ్రెస్ సహా బీజేపీ వ్యతిరేక పార్టీలు రాజకీయ దురుద్దేశంతోనే రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. పౌర గుర్తింపును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని ద్వజమెత్తారు.

బంగ్లా చొరబాటుదారులకు వత్తాసు పలుకుతూ వీరు దేశానికి అన్యాయం చేస్తున్నారని బిజెపి నేత ఆరోపించారు. ఈ ఎన్‌ఆర్‌సీని ప్రశ్నించడం, ఎన్‌ఆర్‌సీ అమలుతో దేశంలో అంతర్యుద్ధం వస్తుందంటూ ప్రచారం చేయడం అంటే దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును వ్యతిరేకించడమేనని స్పష్టం చేసారు. ఈ అంశాన్ని బీజేపీ తేలికగా తీసుకోదని తెలుపుతూ  జాతీయ పౌర గుర్తింపుపై బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు అస్థిరతతో కూడిన అభివృద్ధి నిరోధక శక్తులుగా మారాయని మండిపడ్డారు.

ఇప్పటికే ఉత్తరాదిన పూర్తి ఆధిపత్యం కలిగిన బీజేపీ రానున్న ఎన్నికల నాటికి దక్షిణాదిలో కూడా బలమైన శక్తిగా ఎదుగుతుందని మురళీధర రావు ధీమా వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల అనంతరం దక్షిణ, ఈశాన్య ప్రాంతాలపై దృష్టి సారించిన బీజేపీ ఈశాన్య రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధించిందని గుర్తు చేసారు. భవిష్యత్‌లో దక్షిణాదిలో కూడా అవే ఫలితాలు సాధిస్తామని భరోసా వ్యక్తం చేసారు.

ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని మరింత బలోపేతం చేయడం, జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు, దానికి చట్టబద్దత కల్పించడం వంటి బిల్లులు ఆమోదంతో బీజేపీకి ఆయా వర్గాలపై ఉన్న అభిమానం వెల్లడైందని పేర్కొన్నారు.