కర్ణాటక సంకీర్ణానికి అగ్నిపరిక్షగా మారిన ఉపఎన్నికలు

కర్ణాటకలో మూడు లోక్‌సభ, రెండు విధానసభ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికలు సంకేర్ణ ప్రభుత్వానికి అగ్నిపరిక్షగా మారాయి. ఇప్పటికే ఓడిదోడికులు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఈ ఉపఎన్నికల ఫలితం ఒక విధంగా ప్రజల తీర్పుగా మారే అవకాశం ఉంది. అభ్యర్ధుల ఎంపికపై రెండు పార్టీలలో కుడా అసమ్మతి ఎదురవుతున్నది. కాంగ్రెస్ లో అయితే పోటీకి ఎవ్వరు ముందుకు రావడం లేదు.

మంగళవారం నామినేషన్ల గడువు ముగియనుండగా కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థులు ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. కాంగ్రెస్‌- జనతా దళ్‌ భాగస్వామ్య పక్షాల ఒప్పందం మేరకు శివమొగ్గ, బళ్లారి, మండ్య లోక్‌సభ స్థానాల్లో మండ్య నుంచి జేడీఎస్‌, మిగిలిన రెండు చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేయాలి. శివమొగ్గ నుంచి కాంగ్రెస్‌ నేతలెవరూ పోటీకి సముఖత వ్యక్తం చేయకపోవడంతో అక్కడ దళ్‌ అభ్యర్థి బరిలో దిగనున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప అతి కష్టం మీద పోటీకి అంగీకరించారు.

కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రులు కిమ్మన రత్నాకర్‌, కాగోడు తిమ్మప్ప ఈ ఎన్నికలపై ఆసక్తి చూపలేదు. బళ్లారి నుంచి ఇంత వరకు కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ జిల్లా నుంచి ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్నా అభ్యర్థి ఎంపిక ఓ కొలిక్కి రాలేదు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ శనివారం బెంగళూరు పర్యటన సందర్భంగా బళ్లారి అభ్యర్థి విషయంపై చర్చించినా స్పష్టత రాలేదు. ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కొరత కారణంగా ఎంపిక ఆలస్యమవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే నాగేంద్ర సోదరుడు వెంకటేష్‌ ప్రసాద్‌ ను సోమవారం ఖరారు చేసిన్నట్లు చెబుతున్నారు.

రెండు విధానసభ క్షేత్రాల్లో ఒకటైన రామనగరను దళ్‌కు వదలి పెట్టినా అక్కడ కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సి.ఎం.లింగప్ప కుమారుడు మూడ్రోజుల కిందటే బిజెపిలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి దళ్‌ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంపై ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.