ఆర్‌ కృష్ణయ్యకు కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి ఆఫర్

గత ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీచేసి శాసన సభకు ఎన్నికైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌ కృష్ణయ్య ప్రస్తుతం ఏ పార్టీ నుండి పోటీ చేయాలో నిర్ణయానికి రాలేక పోతున్నారు. ఒక వంక సిపిఎం నాయకత్వంలోని బి ఎల్ ఎఫ్ ఆయనను కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా చేయడానికి ఆఫర్ ఇచ్చింది. అయితే ఆ కూటమికి కెసిఆర్ వ్యతిరేక వోట్లను చీల్చి, టి ఆర్ ఎస్ కు మేలు చేకూర్చడం తప్ప సీట్లు గెల్చుకొనే సత్తాలేదని గ్రహించి ఇప్పటి వరకు కృష్ణయ్య స్పందించనే లేదు.

అయితే తాజాగా కాంగ్రెస్ ఆకర్షణీయమైన ఆఫర్ తో క్రిష్ణయ్యను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసే విధంగా, ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదా కలిగిన అధికార పదవి ఇస్తామని తెలంగాణ జన సమితి అధినేత ఏం కోదండరామ్ కు ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్ తాజాగా కృష్ణయ్యకు ఏకంగా తమ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చిన్నట్లు తెలుస్తున్నది.

మహాకూటమి తరపున కోరిన చోట ఎమ్మెల్యే టికెట్టు ఇస్తామని కుడా తెలిపింది. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్ చార్జ్ కుంతియా ఈ విషయమై కొద్ది రోజుల క్రితం కృష్ణయ్యతో చర్చించినట్టు తెలిసింది. కాంగ్రె స్‌ ఆఫర్‌పై వారం రోజుల్లో ఆయన తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పిన కృష్ణయ్య అందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నెల కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తున్నది.

మొన్నటి వరకు టిడిపి ఎమ్మెల్యేగానే ఉన్న కృష్ణయ్య ఇప్పటి వరకు ఆ పార్టీకి రాజీనామా చేయనే లేదు. పైగా ఆ పార్టీతో సంబంధాలు కూడా పెట్టుకోవడం లేదు. బిసి ఎజెండాతో తిరుగుతున్నారు. గతం ఎన్నికలలో టిడిపి నుండి తెలంగాణలో 15 మంది శాసన సభకు ఎన్నికైతే వారిలో ప్రస్తుతం ఒక్కరే మిగిలి ఉన్నారు. చాలామంది టీఆర్‌ఎస్‌లోకి చేరినా కృష్ణయ్య మాత్రం అందులోనే కొనసాగారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో కృష్ణయ పేరును చేర్చక పోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఆయనను కాంగ్రెస్‌పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ రామచంద్ర కుంతియా, టీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆయనతో చర్చలు జరిపారు. పార్టీలో చేరితే మంచి కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని ఇస్తామని కుడా హామీ ఇచ్చారు. ఆ తర్వాత జరిపిన చర్చల్లో ఏకంగా ఉప ముఖ్యమంత్రితో పాటు పార్టీలో కూడా ప్రాధాన్యత కలిగిన పోస్టును ఇస్తామని చెప్పినట్టు తెలిసింది.