అక్షరాస్యతలో అట్టడుగున బీహార్ తర్వాత తెలంగాణ

దేశంలో అభివృద్దిలో తెలంగాణ నెంబర్‌వన్‌ అని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పదేపదే చెప్పుకుంటూ వస్తున్నారు. గుజరాత్ తర్వాత సంపన్న రాష్ట్రమని, మిగులు రాస్త్రమని,  సొంత ఆదాయ వనరులు పెంచుకోవడంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందని కేసీఆర్‌ పలు సందర్భాలలో ప్రకటించారు. ఆర్థికాభివృద్ధి, ప్రగతిలోనూ దేశంలోనే నెంబర్‌వన్‌ అని ఊదరగొట్టారు. మద్యం అమ్మకాలు మొదలుకొని ఐటీ ఎగుమతుల వరకు అగ్రస్థానంలో ఉన్నామని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రగాల్భాలు పలుకుతున్నారు.

అయితే మానవాభివృద్ధి సూచికలో మాత్రం దేశంలోనే పదో స్థానంలో తెలంగాణ నిలిచింది. ఇక అక్షరాస్యతలో అన్ని రాష్ట్రాల కంటే అట్టడుగు స్థానంలో తెలంగాణ ఉంది. దేశంలో 29 రాష్ట్రాల్లో అట్టడుగున బీహార్‌ ఉంటే ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ స్థానం దక్కించుకోవడం గమనార్హం. అన్ని రంగాల్లో నెంబర్‌వన్‌ అని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అక్షరాస్యతపై మాత్రం ఎప్పుడూ నోరుమెదపడం లేదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అక్షరాస్యత పెంపుపై నాటి పాలకులు దృష్టి సారించలేదు. తెలంగాణ వచ్చినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అక్షరాస్యతను పెంచాలన్న సంకల్పం తో పనిచేసిన దాఖలాలు లేవు. బంగారు తెలంగాణ నిర్మిస్తామని పదేపదే చెప్తున్నా విద్యారంగానికి నిధులు కేటాయింపులోనూ, అక్షరాస్యత పెంపులోనూ శ్రద్ధ చూపలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్షరాస్యతను పెంచడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని తేటతెల్లం అవుతున్నది.

ధనిక రాష్ట్రం అంటూనే విద్యారంగానికి నిధుల కేటాయిం పులో ఏటా కోత విధించింది. కేజీ టు పీజీ ఉచితవిద్య అని టీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించినా ఆచరణలో అమలుకు నోచుకోలేదు. కేజీ, పీజీ తరగతుల్లేకుండానే గురుకులాలను స్థాపించి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేతులు దులుపేసుకుంది. అక్షరాస్యతను పెంచకుండా, అందరికీ నాణ్యమైన విద్య అందించకుండా, చదువుకున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించకుండా బంగారు తెలంగాణ ఎలా నిర్మిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అధికారంలోకి వచ్చాక కొత్తగా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయక పోగా వెసులుబాటు కావడం లేదంటూ వందలకొద్దీ పాఠశాలలను మూసి వేసింది. ఉపాధ్యాయులు లేక చాల పాఠశాలలు మొక్కుబడిగా నడుస్తున్నాయి. సుమారు లక్ష వారు ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా నాలుగేళ్ళలో ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలేదు.

2014లో ఆవిర్భవించిన తెలంగాణ 66.46 శాతం అక్షరాస్యతతో దేశంలోనే అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచింది. జాతీయ సగటు కంటే తెలంగాణ 7.58 శాతం తక్కువగా నమోదైంది. తెలంగాణలో 2.07 కోట్లు (66.46 శాతం) మంది అక్షరాస్యులుండగా, వారిలో పురుషులు 1.17 కోట్లు (74.95 శాతం), మహిళలు 90.35 లక్షలు (57.92 శాతం) అక్షరాస్యులుగా ఉన్నారు.

తెలంగాణలో అక్షరాస్యతలో జోగులాంబ గద్వాల జిల్లా 49.87 శాతంతో అట్టడుగు స్థానంలో ఉన్నది. చివరి నుంచి రెండో స్థానంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా 54.38 శాతంతో నిలిచింది. అక్షరాస్యతలో రాష్ట్ర సగటు 66.46 శాతం కంటే 26 జిల్లాలు తక్కువగా నమోదు చేశాయి. రాష్ట్ర సగటు కంటే ఎక్కువ అక్షరాస్యతను నమోదు చేసిన జిల్లాలు ఐదు మాత్రమే ఉండడం గమనార్హం. హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, కరీంనగర్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలున్నాయి.

రాష్ట్రంలో అత్యధికంగా అక్షరాస్యతను నమోదు చేసిన జిల్లాగా 83.25 శాతంతో హైదరాబాద్‌ నిలిచింది. రాష్ట్రంలో 584 మండలాలున్నాయి. జాతీయ సగటు కంటే రాష్ట్రంలో 63 మండలాలు ఎక్కువ అక్షరాస్యతను నమోదు చేశాయి. రాష్ట్ర సగటు కంటే ఎక్కువ అక్షరాస్యత నమోదు చేసిన మండలాలు రాష్ట్రంలో 112 ఉన్నాయి. రాష్ట్ర సగటు కంటే తక్కువ అక్షరాస్యతను నమోదు చేసిన మండలాలు 472 ఉండడం గమనార్హం.