సీఆర్డీయే కమిషనర్‌ కు రూ రూ.2 వేలు జరిమానా

కోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేసిన సీఆర్డీయే కమిషనర్‌ శ్రీధర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.2 వేలు జరిమానా విధించింది. అదేసమయంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు రూ.2 లక్షలు జమ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. కమిషనర్‌ తరఫున స్పెషల్‌ జీపీ రమేష్‌ కోర్టు ఉత్తర్వులను కమిషనర్‌ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించలేదని, సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలు నిలుపుదల చేయాలని అభ్యర్థించగా ధర్మాసనం సింగిల్‌ జడ్జి ఆదేశాలు నెలరోజుల పాటు నిలపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

అయితే జరిమానా మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలని తేల్చి చెప్పింది. డిపాజిట్‌ చేసిన రూ.2 వేలు కోర్టు ఇచ్చే తుదితీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎస్వీ భట్‌తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. సీఆర్‌డీఏ పరిధిలోని విజయవాడ మురళీనగర్‌లో అనుమతి లేకుండా నిర్మించిన అదనపు అంతస్థును ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు అదనంగా నిర్మించిన అంతస్తు క్రమబద్ధీకరణ విషయంలో పిటిషనర్‌ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని, వాటిని తిరస్కరించడానికి తగిన కారణాలు చూపిన మీదటే క్రమబద్ధీకరణ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. పిటిషనర్‌ వివరణ తీసుకోకుండానే అదనంగా నిర్మించిన అంతస్థును అధికారులు క్రమబద్ధీకరించారు. పిటిషనర్‌ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు.

దీంతో సీఆర్‌డీఏ కమిషనర్‌పై సుమోటోగా కేసు నమోదు చేసిన కోర్టు రూ.2 వేలు జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో 4 వారాలు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని జూలై 17న తీర్పు చెప్పింది.