పోటీకి కోదండరామ్ వెనుకడుగు...పదవితో సరి

ఉద్యమ నేతగా చెప్పుకొంటూ వచ్చిన తెలంగాణ జన సమితి అధినేత ఏం కోదండరామ్ ఎన్నికలలో పోటీకి వెనుకడుగు వేస్తున్నారు. మొదట్లో ఎవ్వరితో పొత్తు లేదని, మొత్తం అన్ని సీట్లకు పోటీ చేస్తామని చెప్పుకొంటూ వస్తున్న ఆయన చివరకు కాంగ్రెస్ తో పొత్తుకు సిద్దపడ్డారు. ఈయనకు, ఈయన పార్టీకి బలం లేదని గ్రహించి నాలుగైదుకు మించి సీట్లు ఇవ్వనని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తూ ఉంటె సీట్ల కోసం బేరం సాగిస్తూ వచ్చారు.

తమ పార్టీ గురించి చులకనగా మాట్లాడుతున్నారని, తాను పోటీ చేయడం లేదని ప్రచారం కుడా చేస్తున్నారని చెప్పుకొంటూ వచ్చిన ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుపొందే అవకాశాలు కనిపించక పోవడంతో కాలి మడమ తిప్పక తప్పడం లేదు. ఎన్నికలలో పోటీ చేయడం కన్నా, తెలంగాణ అంతా ప్రచారం చేస్తే ఎక్కువ ఉపయోగం అనే సాకుతో అసలు పోటీకి దూరంగా ఉండేందుకు నిర్ణయించిన్నట్లు తెలుస్తున్నది.

ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే అందులో ఉప ముఖ్యమంత్రి హోదా గల అధికార పదవి కట్టబెట్టేందుకు అంగీకారం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పైగా తెలంగాణ జన సమితి పేరుతో పోటీ చేస్తే గెలుపొందే అవకాశాలు ఉన్న అభ్యర్ధులే కనిపించడమ లేదు. ఆ పార్టీ పేరు, పార్టీ గుర్తు ప్రజలకు తెలిసే పాటికి ఎన్నికలు ముగుస్తాయని ఆందోళన చెందుతున్నారు. దానితో కాంగ్రెస్ పార్టీ గుర్తు తోనే పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి.

తెలంగాణ ఉద్యమం సందర్భంగా అన్ని ప్రతిపక్షాలు కలసి ఏర్పాటు చేసిన జెఎసి కి ఏ పార్టీతో సంబంధం లేని నాయకత్వం కావాలని కోదండరామ్ కు అప్పచెబితే దాని నుండి ఒకొక్క పార్టీని బయటకు గెంటివేసేటట్లు చేసి, చివరకు కెసిఆర్ కు అనుబంధ సంస్థగా మార్చారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చాక దగ్గరకు రానీయక పోవడంతో జెఎసి పేరుతో రాజకీయ మనుగడకోసం ప్రయత్నం చేస్తినా పెద్దగా ఫలించలేదు. ఇప్పుడు ఉద్యమకారులతో అంటూ ప్రారంభించిన రాజకీయ పక్షాన్ని తనకు అధికార పదవి పొందటం కోసం కాంగ్రెస్ పార్టీకి ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి.