మంత్రి పదవికి ఎంజే అక్బర్ రాజీనామా ?

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర విదేశీ సహాయ మంత్రి ఎంజే అక్బర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన్నట్లు తెలుస్తున్నది. ఆయన తన రాజీనామా లేఖను ఆదివారం పీఎంవోకు ఈ-మెయిల్ చేసిన్నట్లు చెబుతున్నారు. కాగా ఎంజే అక్బర్ రాజీనామాపై పీఎంవో  అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మంత్రి ఎంజే అక్బర్ తన కార్యాలయంలోనే ఉన్నారని పేర్కొంది. 

మరోవైపు  ఎంజే అక్బర్ తన  నైజీరియా పర్యటన ముగించుకుని ఇవాళ ఉదయమే ఢిల్లీ చేరుకున్నారు. కేంద్రమంత్రి రాకను తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై వారు ఒక్కసారిగా ఎంజే అక్బర్‌పై సంధించారు. అయితే ఆయన మాత్రం సింపుల్‌గా త్వరలోనే ప్రకటన చేస్తానంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఎడిటర్‌గా ఉన్న సమయంలో అక్బర్‌ తమను వేధించాడని ‘మీ టూ’ ఉద్యమంలో భాగంగా ఎంజే అక్బర్‌పై పలువురు మహిళా జర్నలిస్టులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా బీజేపీ స్పందించలేదు. అయితే, విదేశీ పర్యటనలో ఉన్న అక్బర్‌ను హుటాహుటిన దేశానికి రప్పించడం వెనుక #మీటూ ప్రకంపనలు ఉన్నట్టు తెలుస్తోంది. అక్బర్ ను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్  చేస్తున్న సంగతి తెలిసిందే.

అక్బర్‌ను మంత్రివర్గంలో కొనసాగించాలా వద్దా అనే అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకుంటారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఆయనను పదవిలో కొనసాగించడం కష్టమేనని అంటున్నాయి. మహిళా జర్నలిస్ట్‌లతో ఆయన అసభ్యకరంగా వ్యహరించినట్టు ఆరోపణలు వచ్చాయి. 

ప్రియ రమణి అనే జర్నలిస్ట్‌ తొలుత అక్బర్‌ ఆకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అనంతరం ప్రేరణ సింగ్ బింద్రా, మరికొంతమంది మహిళా జర్నలిస్టులు అక్బర్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఎంజే అక్బర్‌, ది టెలిగ్రాఫ్‌, ఆసియన్‌ ఏజ్‌, ది సండే గార్డియన్‌ వంటి ప్రముఖ వార్తా పత్రికలకు ఎడిటర్‌గా వ్యహరించారు.