బిజెపి నేతలతో ఎక్కడా బంధుత్వం లేదు : పవన్

బీజేపీ నేతలతో తనకు ఎక్కడా బంధుత్వం లేదన్నారు. ప్రధాని మోదీని, బీజేపీనీ ఎప్పుడూ, ఎక్కడా వెనకేసుకు రాలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.  తాను తన కుటుంబ సభ్యులనే వెనకేసుకురానని చెబుతూ మోదీని ఎందుకు వెనకేసుకొస్తానని ప్రశ్నించారు.

విజయవాడలో పార్టీ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని శనివారం ప్రారంభిస్తూ ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను మొదటి నుంచీ ఒకే మాటమీద ఉన్నానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుభవం హోదా అంశంలో పది సార్లు మాట మార్చేలా చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం పెడితే వచ్చి తమ అభిప్రాయాలను చెప్పి, ఢిల్లీలో మోదీని నిలదీస్తానని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక పోతే దానిపై ఎవరైనా సరే వివరణ ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడ్డారు. హామీలు నెరవేర్చని వారిని రీకాల్ చేసే వ్యవస్థ రూపొందాలని సూచించారు. సమకాలీన రాజకీయాల్లో జవాబుదారీతనం లేకపోవడం తోనే రాష్ట్రానికి ఇటువంటి పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఎదైనా చేయాలనే తలంపుతో నాడు సంపాదనను వదిలి, ఏదీ ఆశించకుండా అనుభవం ఉన్న బాబుకు మద్దతిచ్చానని గుర్తు చేసారు.

గతంలో ముఖ్యమంత్రి పెట్టిన ఆఖిలపక్ష సమావేశం చిత్తశుద్ధితో పెట్టింది కాదని, అందుకే నాడు జనసేన హాజరు కాలేదని తెలిపారు. నేడు ప్రజలకు మాటలు చేప్పే ప్రజాప్రతినిధులు ఉన్నారే తప్ప, ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకులే లేరని విచారం వ్యక్తం చేసారు.  మేధావులు, రాజకీయ నాయకులతో కలసి జనసేన ఏర్పాటు చేసిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ విభజిత ఏపీకి రావాల్సిన, కావాల్సిన వాటి గురించి నివేదిక తయారు చేసిందన్నారు. ఆ నివేదికలోని అంశాలను చట్టసభల్లో ఉన్న టీడీపీ, వైసిపి నేతలు ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు.

తాను చట్టసభల్లో లేని కారణంగా ఆ బాధ్యతను పదవుల్లో ఉన్నవారు తీసుకోవాలని చెప్పారు. ఐటీ దాడులు ఢిల్లీ తరహాలో ఇక్కడి సచివాలయంపైనో, సీఎం కార్యాలయం పైనో జరిగి ఉంటే ఖండించే వాడినని స్పష్టం చేసారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్థులపై ఐటీ దాడులు చేస్తే ఎందుకు స్పందించాలని పవన్ కళ్యాణ్ ప్రశించారు. ఈ దాడులపై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తామని తెలిపారు.

కాగా,  తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అనుకోని పరిస్థితుల్లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని చెప్పారు. ధవళేశ్వరం కవాతు అనంతరం ఎన్నికలపై పార్టీతో చర్చించి, నిర్ణయం తీసకుంటామని తెలిపారు. తప్పకుండా తెలంగాణ లో జనసేన పోటీ చేస్తుందని, 23 నుండి 14 స్థానాల్లో పోటీకి దిగే అలోచన ఉందని వివరించారు.

తిత్లీ  తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులను త్వరలోనే కలుస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. శ్రీకాకుళం ప్రాంతానికి తుఫాన్ తాకిడి తగలడం ఎంతో బాధ కలిగించిందని చెప్పారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకుంటూనే ఉన్నానన్నారు. ఆ ప్రాంత వాసులకి మనస్ఫూర్తిగా అండగా ఉంటనని భరోసా ఇచ్చారు. ఇప్పటికే జనసేన పార్టీ శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలసి సహాయచర్యలో భాగం పంచుకుంటున్నట్లు చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వెళ్తే సహాయచర్యలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతోనే వెళ్లడం లేదన్నారు. ఈనెల 15న జన కవాతు పూర్తయ్యాక 16న విశాఖకు వెళ్లి మరుసటి రోజు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను కలసుకుంటానని తెలిపారు.