భారత్ ఎన్నికలపై రష్యా ఆసక్తి !

అమెరిక అద్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రష్యా ఇప్పుడు వచ్చే సంవత్సరంలో జరుగబోయే భారత ఎన్నికల పైన సహితం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. భారత్, బ్రెజిల్ లతో సహా పలు దేశాలలో జరుగబోవు ఎన్నికల గురించి రష్యా ఆసక్తి కనబరుస్తున్నట్లు అమెరిక సేనేటర్ల ముందు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ సోషల్ మీడియా నిపుణులు ఫిలిఫ్ హోవార్డ్ పేర్కొనడం సంచలనం కలిగిస్తున్నది.

సోషల్ మీడియా సంస్థలపై విదేశీ ప్రభావం అన్న అంశంపై సెనేట్ ఇంటలిజెన్స్ కమిటీ జరుగుపున్న విచారణ సందర్భంగా హోవార్డ్ ఈ విధంగా పేర్కొన్నారు. అయితే అందుకు ఎటువంటి వివరణను ఇవలేదు. అమెరికాలో వలే ఆయా దేశాలలో మీడియా అంత స్వేచాగా లేకపోవడం, కొన్ని పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలు వాటికి కీలకంగా మారుతూ ఉండడంతో రష్యా జోక్యం ప్రమాదకరంగా మారవచ్చని మాత్రం ఆందోళన వ్యక్తం చేసారు.

2016 అమెరిక అద్యక్ష ఎన్నికలలో సోషల్ మీడియా సంస్థలపై రష్యా జోక్యం చేసుకున్నట్లు గత ఏడాది జనవరిలో అమెరిక నిఘా సంస్థలు ధృవీకరించడం ఈ సందర్భంగా గమనార్హం.

సోవియట్ యూనియన్ గా ఉన్నప్పటి నుండి రష్యా ఇతర దేశాలలో ఎన్నికలు, రాజకీయ పరిణామాలపై ఆసక్తి కనబరుస్తూనే ఉన్నది. ముఖ్యంగా ఇతర దేశాలలో మీడియాను, రాజకీయ శక్తులను ప్రభావితం చేయడం ద్వారా తమ రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలు సాధించుకొనే కృషి చేస్తున్నది.

1979లో జనత పార్టీ ప్రభుత్వం పడిపోవడానికి దారితీసిన పార్టీలో `ద్వంద సభ్యత్వం’ వివాదాన్ని తెరపైకి తీసుకు రావడంలో రష్యా అనుకూల వర్గాలు సహితం కీలక పాత్ర వహించాయి. ఎమర్జెన్సీ సమయంలో మహారాష్ట్రలోని జైలు లో ఆర్ ఎస్ ఎస్ అధినేత బాలసాహెబ్ దేవరస్ తో కలసి ఉన్న ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు మధులిమయా ఆర్ ఎస్ ఎస్ గురించి ఇప్పటి వరకు తాను తప్పుడు అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నట్లు అంగీకరించారు. పైగా జైలు నుండి తాను బయటకు `నిక్కరు’ వేసుకొని వచ్చిన ఆశ్చర్య పోనవసరం లేదని అంటూ బయట ఒక మిత్రుడికి లేఖ కుడా వ్రాసారు.

మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం స్థిరపడటం, ప్రభుత్వం అందిస్తున్న పరిపాలన పట్ల ప్రజలలో మంచి ఆదరణ లభిస్తున్న సమయంలో రష్యా పర్యటనకు వెళ్లి వచ్చిన మధులిమయా అకస్మాత్తుగా స్వరం మార్చివేసారు. జనతా పార్టీలోని వారెవ్వరూ ఆర్ ఎస్ ఎస్ లో సభ్యులుగా ఉండడానికి వీల్లేదని అంటూ `ద్వంద సభ్యత్వం’ వివాదాన్ని లేవదీసారు. ఆ వివాదమే ఆ ప్రభుతం పతనానికి దారితీయడం అందరికి తెలిసిందే.