ముఖ్యమంత్రి పదవిపై కోదండరామ్ కన్ను !

ఎవరితో పొత్తు లేకుండా సొంతంగా అన్ని నియోజక వర్గాలలో పోటీ చేస్తామని ప్రగల్భాలు పలికిన తెలంగాణ సమితి అధినేత ఏం కోదండరామ్ చివరకు కాంగ్రెస్, టిడిపి, సిపిఐలు కలసి ఏర్పరచిన `మహాకుటమి’లో భాగస్వామి కావడానికి అంగీకరించారు. దానిని ఒక `చారిత్రిక’ అవసరంగా అభివర్ణించారు.

ఇతర ప్రజా సంఘాల మద్దతుతో పలు ఉద్యమాలు చేపట్టినా సొంతంగా జనాన్ని సమీకరించే సామర్ధ్యం లేదని, పైగా ఆయన పార్టీకి కొన్ని నగర ప్రాంతాలలో మినహా జిల్లాల్లో ఉనికే లేదని కాంగ్రెస్ తొలుత మూడు నుండి ఐదు సీట్లకు మించి ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయలేదు.

దానితో బిజెపి నాయకులతో సంప్రదింపులు జరపడం ద్వారా కాంగ్రెస్ పై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేసారు. సీట్ల సంగతి 24 గంటలలో తేల్చక పోతే తన దారి తాను చూసుకుంటాను అని బెదిరించారు. ఆ విధంగా బెదిరించి నాలుగు రోజులు అవుతున్నా సీట్ల సంగతి ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపించడం లేదు.

కాంగ్రెస్ నేతలు ఒక మెట్టు కిందకు దిగి ఎనిమిది సీట్ల వరకు ఇవ్వడానికి అంగీకరించారు. మొదట 30 వరకు సీట్లు కావాలని పట్టుబట్టిన కోదండరామ్ ఇప్పుడు లోక్ సభ నియోజక వర్గానికి ఒకటి చప్పున మొత్తం 17 సీట్లు ఇవ్వాలని కోరుతూ, 15 వరకు సర్దుకుంటామని చెబుతున్నారు. సీట్లు ఇచ్చినా ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో సంబంధాలు గల అభ్యర్ధులు లేరని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు.

ఇప్పటి వరకు తాను ఎక్కడి నుండి పోటీ చేయాలో కోదండరామ్ నిర్ణయించుకో లేక పోతున్నారు. ముందుగా తన సొంత గ్రామం గల నియోజకవర్గంలో  పోటీ చేద్దాం అనుకుంటే అక్కడ ఈయన ఎవ్వరో తెలియదని, పోటీ చేస్తే ఘోర పరాభావం తప్పదని సన్నిహితులు హెచ్చరించారు. దానితో కాంగ్రెస్ కు బలం గల నగర ప్రాంతాలలోని ఒక సీట్ కోసం చూస్తున్నరు. క్షేత్ర స్థాయి యంత్రాంగం లేకపోవడంతో ఎక్కడ పోటీ చేసినా గెలుపొందటం కష్టం అని భావిస్తున్నారు.

ఇటువంటి కధనాలు వస్తూ ఉండడంతో ఆగ్రహం చెందిన కోదండరామ్ తాను అసలు పోటీ చేయడం లేదని వదంతులు వ్యాప్తి చేస్తున్నారని అంటూ కోపం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీ వద్ద సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఒక ప్రముఖిడి ద్వారా తనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటిస్తే కెసిఆర్ కు డిపాజిట్లు గల్లంతు అన్నట్లు కలర్ ఇచ్చారని ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్పారు.

ఎట్లాగు `హంగ్ అసెంబ్లీ’ ఏర్పడుతుందని, 10 సీట్లు అయినా గెల్చుకొంటే కర్ణాటకలో హెచ్ డి కుమారస్వామి వలే తాను ముఖ్యమంత్రి కావచ్చని కోదండరామ్ అంచనాలు వేస్తున్నట్లు తెలుస్తున్నది. అవసరమైతే సిపిఏం, మజ్లిస్ లు కుడా తనకే మద్దతుగా వస్తారని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే కాంగ్రెస్ నాయకుల ఆలోచన మరో విధంగా ఉంది. ఎటువంటి యంత్రాంగం, స్థానిక నాయకత్వం లేని తెలంగాణా జన సమితికి సీట్లు ఇవ్వడం అంటే వాటిని పోగొట్టు కోవడానికి సిద్దపడటమే అని చెబుతున్నారు. అయినా కెసిఆర్ వ్యతిరేక ఓట్లలో చీలిక లేకుండా చేయడం కోసం పొత్తుకు ఒప్పుకొంటున్నామని చెబుతున్నారు. కూటమి ఉమ్మడి ప్రచారం అంతా తన సారధ్యంలో జరగాలని కోదండరామ్ పట్టుబట్టడం కుడా చాలామంది కాంగ్రెస్ నేతలకు రుచించడం లేదు.

మరోవంక టిడిపి సహితం ఇప్పటి వరకు సీట్ల సంగతి తేల్చక పోవడం పట్ల కాంగ్రెస్ నేతలపై అసహనం వ్యక్తం చేస్తున్నది. గత ఎన్నికలలో తాము గెలుపొందిన 15 సీట్లకు తక్కువగా ఎట్టి పరిస్థితులలో తమకు ఆమోదయోగ్యం కాబోదని స్పష్టం చేస్తున్నారు. అయితే కోదండరామ్ వలే తొందర పడకుండా కొంత సంయమనం పాటిస్తున్నారు.