తీవ్ర విధ్వంసం సృష్టించిన తిత్లీ పెను తుఫాన్

బంగళాఖాతంలో ఏర్పడిన తిత్లీ పెను తుఫాన్ ఒడిశాతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. గురువారం ఉదయం తీరాన్ని తాకిన ఈ విపత్తు ప్రభావం ఇరు రాష్ర్టాల్లో దాదాపు 60 లక్షల మందికి పైగా ప్రజలపై పడింది. శుక్రవారం గంజాం జిల్లాలో రెండు మృతదేహాలు లభించడంతో తుఫాన్ ధాటికి ఒడిశాలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో గురువారం ఏడుగురు మృత్యువాతపడ్డారు. తిత్లీ మిగిల్చిన విషాదం నుంచి ప్రజలను కాపాడేందుకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ చర్యలు ముమ్మరం చేశాయి.

ఒడిశాలో తుఫాను ప్రభావం భారీగా ఉన్న గంజాం, గజపతి, రాయగడ జిల్లాల్లో అక్కడి ప్రభుత్వం శుక్రవారం ఎన్డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఏఎఫ్ బృందాలను భారీగా మోహరించింది. ఇప్పటికే తీర ప్రాంతంలోని ఐదు జిల్లాల్లో దాదాపు 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దక్షిణ ఒడిశాలో ప్రధానంగా ఉన్న రుషికుల్యా, వంశధార నదులు ప్రమాదస్థాయిలను దాటి ప్రవహిస్తుండటంతో గంజాం, గజపతి, రాయగడ, బాలాసోర్, శ్రీకాకుళం జిల్లాల్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నది.

ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకు ఎన్డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఏఎఫ్ బృందాలను రంగంలోకి దింపి సహాయ, పునరావాస చర్యలు ముమ్మరం చేశామని స్పెషల్ రిలీఫ్ కమిషనర్ (ఎస్‌ఆర్‌సీ) బీపీ సేథి వెల్లడించారు. తుఫాను పరిస్థితుల తర్వాత చేపట్టాల్సిన చర్యలపై సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆయన ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాలో సహాయ, పునరావస చర్యలను పర్యవేక్షించేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లను రాష్ర్టానికి రప్పించారు.

మరోవంక, శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తిత్లీ పెను తుపాను ఓ చీకటి అధ్యాయమే! జిల్లాలో అధిక ప్రాంతాలు ఆ ప్రకృతి విధ్వంసానికి గురయ్యాయి. కొన్ని గ్రామాల రూపురేఖలే మారిపోయాయి. వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ నదులను వరద ముంచెత్తింది. శివారు పల్లెల్లో జనం ఎలా ఉన్నారో కూడా బాహ్య ప్రపంచానికి ఇప్పటికీ తెలియటం లేదు. ఎక్కడికక్కడ రోడ్లపై కుప్పకూలిన భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు కాళ్లకు అడ్డుపడుతున్నాయి. దారీతెన్నూ కరవైంది. తినడానికి తిండి...తాగడానికి నీళ్లు కూడా అందని అభాగ్యులెందరో. జాతీయ రహదారిపై ప్రయాణాలకు మార్గం సుగమం చేసినా.. అంతర్గత మార్గాలు బాగా దెబ్బతిన్నాయి

తుఫాన్ ధాటికి దెబ్బతిన్న శ్రీకాకుళంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మకాం వేసి సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తక్షణమే ప్రజలకు అందాల్సిన సహాయక చర్యలపై దృష్టిసారిస్తున్నామని, ముందుగా ప్రాణనష్టాన్ని తగ్గించి తాగునీటి వసతి, భోజన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అన్ని ఊళ్లకూ వెళ్తానని, అందరి బాగోగులూ చూస్తానని చెప్పారు. బాధితులంతా తేరుకున్నాకే తిరిగి వెళ్తానని భరోసా ఇచ్చారు. అంతవరకు పలాస నుంచే పాలన సాగిస్తానని పేర్కొన్నారు.

ఒడిశా, ఏపీలోని పలు ప్రాంతాల్లో రైల్వేలైన్లు నీటమునిగిపోవడంతో 16 రైళ్లను రద్దు చేయడంతోపాటు పలు రైళ్ల సమయాల్లో మార్పులు చేసినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. మరోవైపు ఒడిశాలో శనివారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ అధికారులు తెలిపారు. తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడి పశ్చిమబెంగాల్ వైపు పయనిస్తున్నదని పేర్కొన్నారు.