కొడుకు సీట్ కోసం రాహుల్ ను కలసిన గద్దర్

జీవితం అంతా విప్లవ గీతాలతో మావోయిస్ట్ ల మద్దతు దారునిగా గడిపిన ప్రజా గాయకుడూ గద్దర్ కొడుకు సీట్ కోసం ప్రత్యేకంగా ఢిల్లీ వరకు వెళ్లి కాంగ్రెస్ అద్యక్షుడు రాహుల్ గాంధీతో భేటి అయ్యారు. పైగా భార్య, కుమారుడిని కుడా తోడుకొని వెళ్లారు.

ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీతో కలిసి రాహుల్‌తో గద్దర్‌ సమావేశమయ్యారు. మహాకూటమికి అనుకూలంగా ప్రచారం చేయడానికి కుడా గద్దర్ సంసిద్దత వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, సింగరేణి ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలను చేపట్టనున్నట్లు తెలుస్తున్నది.

అయితే ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో తన కుమారుడు సూర్యకిరణ్ కు బెల్లంపల్లి నుండి పోటీ చేయడానికి కాంగ్రెస్ సీట్ ఇవ్వాలని కోరిన్నట్లు చెబుతున్నారు. మరో ఇద్దరు అనుచరులకు కుడా కాంగ్రెస్ సీట్ ఇవ్వమని కోరారట. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరానని, కొడుకు మాత్రం ఆ పార్టీ తరపున పోటీ చేస్తారని చెబుతున్నారు.

ముఖ్యంగా బెల్లంపల్లి నుండి  కాంగ్రెస్ తో పొత్తు ఏర్పాటు చేసుకున్న సిపిఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ పోటీ చేయడానికి సిద్దపడుతున్నారు. దానితో సిపిఐని కాదని కుమారుడికి ఆ సీట్ ఇప్పించు కొనేందుకు గద్దర్ ఢిల్లీ దాకా వచ్చి రాహుల్ ను కలసిన్నట్లు తెలుస్తున్నది. గుండా మల్లేష్‌ను పోటీ నుంచి తప్పించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని కుడా కోరనున్నారు.

ఇలా ఉండగా, తాను ఏ పార్టీలోనూ చేరనని, సెక్యులర్ పార్టీల మధ్య వారధిగా ఉంటానని గద్దర్ ఈ భేటి అనంతరం స్పష్టం చేశారు. తనపై గతంలో జరిగిన దాడిపై విచారణ జరిపిస్తామని రాహుల్‌ చెప్పారని తెలిపారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారని పేర్కొన్నారు.

కాగా, కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుకాలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో కొత్త ఫ్యూడల్‌ వ్యవస్థ నడుస్తోందని ద్వజమెత్తారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం బందీఖానాగా మార్చిందని గద్దర్ విమర్శించారు.