అత్యంత దేశాభిమానం కలిగిన బ్రాండ్ ఎస్‌బీఐ

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ.. అత్యంత మాతృదేశాభిమానం కలిగిన బ్రాండ్ అని తేలింది. బ్రిటన్‌కు చెందిన ఆన్‌లైన్ మార్కెట్ రిసెర్చ్-డేటా అనలిటిక్స్ సంస్థ యూగౌవ్ ఓమ్నీబస్ నిర్వహించిన సర్వేలో అత్యధిక భారతీయులు ఎస్‌బీఐపై అభిమానం చూపించారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు వెల్లడైన ఈ జాబితాలో 16 శాతంతో ఎస్‌బీఐ ముందున్నది. ఆ తర్వాత టాటా మోటార్స్, పతంజలికి 8 శాతం చొప్పున, రిలయన్స్ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 6 శాతం చొప్పున ఓట్లు లభించాయి.

 

 ఆర్థిక, ఆటో, కన్జ్యూమర్ గూడ్స్, ఆహార, టెలికం తదితర 11 రంగాల్లోని 152 బ్రాండ్లపై సర్వే జరిగింది. ఈ నెల 2 నుంచి 8 వరకు ఆన్‌లైన్ వేదికగా నిర్వహించిన ఈ అధ్యయనంలో మొత్తం 1,193 మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆయా రంగాలవారీగా చూస్తే ఆర్థిక రంగంలో ఎస్‌బీఐకి 47 శాతం ఓట్లు పడ్డాయి. 16 శాతంతో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ తర్వాతి స్థానంలో ఉన్నది. పేటీఎంకూ మిక్కిలి ప్రజాభిమానం లభించింది.

ఆటో రంగంలో టాటా మోటార్స్ 30 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో 13 శాతంతో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం, 11 శాతంతో మారుతి సుజుకీ నిలిచాయి. ఆహారోత్పత్తుల బ్రాండ్లలో అమూల్ మొదటి స్థానంలో ఉండగా, పతంజలి ఆ తర్వాతి స్థానంలో ఉన్నది. అయితే కన్జ్యూమర్ గూడ్స్‌లో పతంజలిదే పైచేయి.

పర్సనల్ కేర్ విభాగంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు పతంజలిపై స్వదేశీ అభిమానం చూపారు. డాబర్, వీకో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. టూత్‌పేస్ట్‌ల్లో కాల్గేట్‌కు విశేష అభిమానులుండగా, డాబర్, వీకో ఆ తర్వాత ఉన్నాయి.

ఇక టెలికం రంగంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జీ సేవల సంస్థ రిలయన్స్ జియోదే ఆధిపత్యం. 41 శాతం ఓట్లు పడ్డాయి. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, జియో తర్వాతి స్థానంతో సరిపెట్టుకున్నది. కాగా, హోమ్‌కేర్ ప్రోడక్ట్స్ విభాగంలో నిర్మాకు పట్టం కట్టిన భారతీయులు బేవరేజెస్ కేటగిరీలో 35 శాతంతో టాటా టీని మొదటి స్థానంలో నిలబెట్టారు. తాజ్ మహల్ బ్రాండ్‌కు 18 శాతం ఓట్లు వచ్చాయి.