రేవంత్‌, రమేష్‌లు చంద్రబాబు బినామీలు

ఆపరేషన్‌ గరుడలో భాగంగానే తెదేపా నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించడం పట్ల బిజెపి ఎంపి జివిఎల్ నరసింహారావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.

నివాసాలు, వ్యాపార కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌, విజయవాడలో ఏకకాలం‍లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన స్వగ్రామం వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది.

అయితే రాష్ట్ర ప్రయోజనాలపై పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసినందునే తనపై కుట్రపూరితంగా ఐటీ దాడులు చేయిస్తున్నారని రమేష్ ఆరోపించారు. లోకేష్ తో పాటు పలువురు టిడిపి నేతలు సహితం ఈ సోదాలను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా విమర్శలు సాగిస్తున్నారు.

మంత్రి లోకేష్‌ వ్యాఖ్యలతో సీఎం రమేష్‌ చంద్రబాబు బినామీ అని తేలిపోయిందని జీవీఎల్‌ స్పష్తం చేసారు. లోకేష్‌  బినామీ ఐటీ కంపెనీలు పెట్టి పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులను, భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రాధమిక ఆధారాలు లేకుండా ఐటీ శాఖ సోదాలు జరపదు, సమాచారం ఉంది కనుకనే దాడులు నిర్వహిస్తుందని తెలిపారు.

ఐటీ అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పకుండా కక్ష సాధింపు చర్యలు అంటే ఎలా అని ప్రశ్నించారు. తప్పు చేయని వారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇతర పార్టీలపై ఐటీ సోదాలు జరిగితే భేష్‌ అన్న టీడీపీ నేతలు తమపై జరిగితే మాత్రం భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి, సీఎం రమేష్‌లు చంద్రబాబు బినామీలని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌కు టీడీపీ ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారని, అదంతా అవినీతి సొమ్మేనని విమర్శించారు. 

ఉక్కు కర్మాగారం కోసం సీఎం రమేష్‌ చేసే దొంగ దీక్షలకు ఎవరూ భయపడరని జీవీఎల్‌ అన్నారు. దీక్ష చేసినందుకే  కక్ష కట్టి కేంద్ర ప్రభుత్వం దాడులు చేయిస్తోదనడంలో వాస్తవం లేదన్నారు. అక్రమార్జనపై వచ్చిన ప్రశ్నలకు సీఎం రమేష్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ ప్టాంట్‌పై ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌తో చర్చలు జరిపామని, ఆయన సానుకూలంగా స్పందించారని జీవీఎల్‌ చెప్పారు. మేకాన్‌ సంస్థ నివేదిక అనంతరం నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.