కోట్లాది మందికి ఉద్యోగం, ఉపాధి కల్పిస్తున్న మోడీ పాలన

కోటి ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో బిజెపి చేసిన హామీని అమలు చేయలేదని అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై బిజెపి అద్యక్షుడు అమిత్ షా విరుచుకు పడ్డారు. ఉద్యోగం అనగానే కేవలం ప్రభుత్వం ఉద్యోగమే కాదని చెబుతూ ఉపాధి కూడా అనంటూ అంతకన్నా ఎక్కువ మందికే ఉద్యోగాలు కల్పిస్తున్నామని స్పష్టం చేసారు. ఇక్కడ ఉద్యోగాలు, స్వయం ఉపాధి అన్న అంశాన్ని కూడా చూడాల్సి ఉంటుందని అమిత్ షా చెప్పారు.

తమ ప్రభుత్వం చేబట్టిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఎన్నో కొత్త ఉద్యోగాలు వస్తున్నాయని అంటూ రెండున్నర రెట్ల వేగంతో రైల్వే ప్రాజెక్టులు వస్తే కొందరికి ఉద్యోగాలు వచ్చాయనుకోవాలా వద్దా? రెండురెట్ల వేగంతో రహదారులు నిర్మితం అవుతుంటే కొందరికి ఉద్యోగాలు వచ్చాయా లేదా ? అని ప్రశ్నించారు. 13 కోట్లమందికి ముద్రా బ్యాంకు ద్వారా రుణాలిచ్చాని, వారు ఆ రుణాల సాయంతో ఇవాళ స్వయం ఉపాధిని పొందుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఔషధాల దుకాణాలు, బ్యూటీపార్లర్లు, ఎంబీబీఎస్‌ చేసిన ఓ వైద్యుడు తన క్లినిక్‌ పెట్టుకోగలిగాడు. ఇవేవీ ఉద్యోగాలు కావా?  అని అడిగారు.

“ఉద్యోగమంటే పని. ఆ పని ఇవాళ మా ప్రభుత్వం వచ్చాక ఎందరికో దొరికింది. మీరు చెప్పిన సంఖ్య కంటే ఎక్కువమందికే మేం ఉపాధి కల్పించాం. ముద్రా బ్యాంకు నుంచి 13 కోట్లమందికి ఉపాధి దొరికిందంటే ఏడాదికి 2 కోట్లమందికి ఉద్యోగాలు కల్పించినట్టే అవుతుంది. 19 వేల గ్రామాల్లో విద్యుత్‌ వెలుగులు వెళ్లాయంటే కొందరికైనా ఉపాధి దొరికే ఉంటుంది కదా?” అని పేర్కొన్నారు. రెండు కోట్ల ఇళ్లు నిర్మిస్తే ఎవరికీ ఉద్యోగమే దొరకలేదా? ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలని బిజెపి అద్యక్షుడు సూచించారు. ప్రతీ ఒక్కరికీ ఉద్యోగమే చూపించాలంటే 70 కోట్లమందికి ఇవ్వాలని, ఏ ప్రభుత్వమూ ఇలా కోట్ల ఉద్యోగాలివ్వలేదని స్పష్టం చేసారు.  

రూపాయి విలువ పడిపోవడంపై స్పందిస్తూ రూపాయి విలువ భారత ఆర్థిక వ్యవస్థతో ముడిపడిలేదని, అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉంటుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరెన్సీల్లో రూపాయి ఒక్కటే ప్రస్తుతం బలంగా ఉందని, అతితక్కువ విలువను కోల్పోయింది కూడా రూపాయేనని తెలిపారు. “మేం అధికారంలోకి వచ్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ 9 స్థానంలో ఉంది. నాలుగున్నరేళ్ల తర్వాత 6 స్థానంలోకి ఎగబాకింది. డిసెంబరు నాటికి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగటం ఖాయం. అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్‌ ఒక్కటే.” అని వివరించారు.

రూపాయి విలువ తగ్గటానికి తాత్కాలిక దశ ఉంటుందని అంటూ ప్రపంచంలో ఇప్పుడు అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోందని, అమెరికా తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాల కారణంగా ఈ తాత్కాలిక దశ వచ్చిందని పేర్కొన్నారు. ఈ కారణంగా ఆర్థిక వ్యవస్థ బలాన్ని, బలహీనతను కొలవలేం కదా అని అడిగారు. కేవలం రూపాయి బలహీనపడటం మూలానే పెట్రో ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఇదు రాష్త్రాలలో స్థానిక అంశాలు వేర్వేరుగా ఉన్నాయని,  అయితే ప్రధాని మోదీ దేశంలో చేసిన వివిధ సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తామని అమిత్ షా తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వమూ దృష్టి పెట్టని 50 కోట్లమంది ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలను, అభివృద్ధిని తాము చేయగలిగామని చెప్పారు. ఐదు కోట్లమంది గ్రామీణ పేదలకు గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చామని,  ఏడున్నర కోట్లమంది ప్రజల ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించామని, 13 కోట్లమందికిపైగా తల్లీబిడ్డలకు టీకాలు వేయించగలిగామని వివరించారు.

దేశవ్యాప్తంగా 50 కోట్లమందికి ఆయుష్మాన్‌ భారత్‌ కింద నేరుగా వైద్య చికిత్స పొందే అవకాశం కలిగిందని చెబుతూ క్యాన్సర్‌, బ్రెయిన్‌ స్టోక్ర్‌, గుండె, కిడ్నీ మార్పిడిలాంటి 1300కు పైగా ఆరోగ్య సమస్యలను ఆయుష్మాన్‌ తీరుస్తోందని తెలిపారు. రూ. ఐదు లక్షల విలువైన వైద్య పరీక్షలు, చికిత్స ఖర్చులు, ఔషధాల ఖర్చులు, ఆస్పత్రి ఖర్చులు ఇలా అన్నీ ఇవ్వగలగటం బిజెపి విజయమని పేర్కొన్నారు.