తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటులో బిజెపి కీలక పాత్ర – అమిత్ షా ధీమా

ప్రస్తుతం 19 రాష్ట్రాల్లో పార్టీ అధికారంలో ఉన్న బిజెపి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నా  మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో తిరిగి తమకే విజయావకాశాలున్నాయని,  తెలంగాణ, మిజోరాంలలోనూ ప్రభుత్వ ఏర్పాటులో తమ పార్టీ పాత్ర కీలకంగా ఉంటుందని బిజెపి అద్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేసారు. తెలంగాణ రాష్ట్ర సమితితో బిజెపికి ఎలాంటి అవగాహన లేదని చెబుతూ  ప్రస్తుత ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ రెండు పార్టీలు కలిసే అవకాశమే లేదని  అమిత్‌షా స్పష్టంచేశారు.

ఈ ఎన్నికల్లో తాము తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని,  అవసరమైతే చిన్న పార్టీలను కలుపుకొని వెళ్తామని “ఈనాడు”కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. రాష్ట్రంలో తమకు 19 శాతం ఓటు బ్యాంకు ఉందని పేర్కొంటూ బిజెపి సాయం లేకుండా ఏ పార్టీ అధికారంలోకి రాలేదని తెలిపారు.  105 సీట్లలో తమకు పూర్తిగా ప్రజాబలం ఉందని చెబుతూ తెలంగాణలో ఎన్ని సీట్లలో గెలుస్తామో చెప్పలేక పోయినా ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్దా తమ పార్టీ కార్యకర్తలు సిద్ధంగానే ఉన్నారని చెప్పారు.

తెలంగాణలో బిజెపి ఈసారి బలమైన పార్టీగా ఎదుగుతుందని విశ్వసిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. మణిపూర్‌లో 1 శాతం,  త్రిపురలో 0.75 శాతం, అసోంలో 4 శాతం ఓట్లు మాత్రమె బిజెపికి ఉండేవని, కానీ అక్కడ పూర్తి బలమున్న బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని గుర్తు చేసారు. ఇక్కడ ప్రజలలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత తమకు పూర్తిగా లాభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ వస్తారని, అభ్యర్థుల ఖరారు అనంతరం ఆయన సభలు ఉంటాయని వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రానికి రూ. 1.15 లక్షల కోట్ల నిధులు ఇచ్చామని చెబుతూ  వాటన్నింటికీ తమ వద్ద లెక్కలున్నాయని చెప్పారు. తెలంగాణా ఎన్నికలలో ప్రజల వద్దకు వెళ్ళడానికి తమ వద్ద అనేక అంశాలు ఉన్నాయని అంటూ ““నా దగ్గర కేసీఆర్‌ తాలూకూ చార్జ్‌ షీటు ఉంది” అని తెలిపారు.

కెసిఆర్  ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. మొదట ఇక్కడ దళిత ముఖ్యమంత్రి అన్నారు. అదేమైంది? ప్రతీ దళితుడికీ మూడెకరాల స్థలం అన్నారు. అవేమయ్యాయి? కొత్త జిల్లాలు ప్రారంభించారు కాని పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామన్నారు. 15 వేల కంటే ఇవ్వలేకపోయారు. సాగునీటి పథకాలు పూర్తి చేస్తామన్నారు. అన్ని పథకాలూ అసంపూర్తిగానే ఉన్నాయి. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామని గొప్పగా చెప్పారు.. 5,000 మందికే ఇచ్చారు. అందరికీ ఆరోగ్యం ఇచ్చే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని కేంద్రం అమలు చేయాలని పంపితే.. దాన్ని నిలిపివేశారంటూ వివరించారు.

ఒవైసీకి ఇక్కడ ప్రజామోదం లేకుండా చేయటమే బిజెపి లక్ష్యం అని స్పష్టం చేస్తూ తెలుగుదేశం,  టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మూడూ ఒవైసీతో కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. తమ పార్టీ ఒక్కటే ఒవైసీకి వ్యతిరేకంగా పోరాడుతోందని తెలుపుతూ  సెప్టెంబరు 17 విమోచన దినోత్సవాన్ని నిర్వహించే దమ్ము ఈ పార్టీలకు లేకపోయిందని ఎద్దేవా చేసారు. కానీ బీజేపీ ఒక్కటే ఆ పనిచేయగలదని చెప్పారు.