మహారాష్ట్రలో కాంగ్రెస్ కు చికాకు కలిగిస్తున్న శరద్ పవార్

మహారాష్ట్రలో తాము ఉమ్మడిగా పోటీ చేయని పక్షంలో తమ ఇద్దరి రాజకీయ ఉనికికి ఇబ్బందికరం కాగలదని ఒక వంక కాంగ్రెస్, మరోవంక ఎన్ సి పి అద్యక్షుడు శరద్ పవార్ గ్రహించారు. అందుకనే లోక్ సభ ఎన్నికలలో ఉమ్మడిగా పోటీ చేయాలనీ నిర్ణయించారు. లేని పక్షంలో బిజెపి ఏకపక్షంగా రాష్ట్రంలో విజయం సాధిస్తుందని భయపడుతున్నారు. అయితే రాష్ట్ర రాజకీయాలలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం శరద్ పవార్ అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడలు కాంగ్రెస్ కు చికాకు కలిగిస్తున్నాయి.

మొదటగా ఒక ఇంటర్వ్యూ లో రాఫేల్ డీల్ లో ప్రధాని నరేంద్ర మోడీ తప్పేమీ లేదని చెప్పడం ద్వారా ఈ డీల్ కేంద్రంగా మొత్తం ఎన్నికల ప్రచారం జరపాలని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ కు పెద్ద షాక్ ఇచ్చారు. తర్వాత తాను ఆ విధంగా మాట్లాడ లేదని ఎన్ని వివరణలను పవార్ ఇచ్చుకున్నా జరుగవలసిన నష్టం జరిగి పోయింది. పవార్ వంటి రాజకీయ ఎత్తుగడలలో ఆరితేలిన నేత అటువంటి సున్నితమైన అంశంపై మాట జారే అవకాశం ఉండదు. ఉద్దేశ్య పూర్వకంగానే అని ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధాని మోడితో ఆయనకు గల సన్నిహిత సంబంధాలు అందరికి తెలిసినవే.

మరోవంక రాజ్ థాకరే నాయకత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సమితిని కుడా తమ కూటమిలో భాగస్వామిగా చేర్చుకోవాలని పవార్ చేస్తున్న ప్రయత్నాలు కాంగ్రెస్ ను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇప్పటికే గుజరాత్ నుండి ఉత్తరాది రాష్త్రాలకు చెందిన వలస కార్మికులు తమ పార్టీ ఎమ్యెల్యే రేచ్చగొట్టడంతో రాష్త్రం వదిలి వెళ్ళిపోతున్నారనడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది.

మహారాష్ట్రలో ఇతర రాష్ట్రాల నుండి, ముఖ్యంగా బీహార్ తదితర రాష్త్రాల నుండి వచ్చిన ఉద్యోగులు, కార్మికుల పట్ల వ్యతిరేక ధోరణులను ఉద్దావ్ థాకరే అనుసరిస్తూ ఉండటం అందరికి తెలిసిందే. ఇతరులు వచ్చి మహారాష్ట్రీయులకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని అంటూ పలు సార్లు ఆందోళనలు కూడా జరిపారు. అటువంటి నేతతో పొత్తు పెట్టుకోవడం ఆత్మహత్య సాదృశ్యం కాగలదని కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు. అయితే బిజెపి వ్యతిరేక వోటర్లలో చీలిక నివారించడం కోసం ఇది అవసరమని పవార్ పట్టుబడుతున్నారు.

మరోవంక, స్వభిమాని శేత్కారి సంఘటన నేత రాజు శెట్టి ఇప్పుడు  కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నారు. అతనితో పాటు భారిప్ బహుజన్ మహాసంఘ్ నేత ప్రకాష్ అంబేద్కర్ ను కుడా కలుపుకోవాలని అతను పట్టుబడుతున్నారు. అందుకు కాంగ్రెస్ సుముఖంగానే ఉంది. గత ఎన్నికలలో బిజెపి మద్దతుతో రాజు గెలుపొందారు. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు పవార్ మౌనంగా ఉన్నారు.