కుప్పం నుండి లోకేష్, తిరుపతి నుండి చంద్రబాబు పోటీ !

తన రాజకీయ వారసుడిగా నిర్ణయించిన కుమారుడు నారా లోకేష్ అసెంబ్లీకి పోటీ చేయడం కోసం సురక్షితమైన స్థానాన్ని అన్వేషించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విఫలం అయిన్నట్లు తెలుస్తున్నది. ముందుగా కృష్ణా జిల్లా నుండి పోటీ చేయించాలని మూడు నియోజకవర్గాలను పరిశీలించినప్పటికీ ఎక్కడ నుండి పోటీ చేసినా లోకేష్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలలేదని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.

తాను మొదటిసారి 1978లో అసెంబ్లీకి ఎన్నికైన తమ స్వగ్రామం ఉన్న చంద్రగిరి నుండి పోటీ చేయించాలని కుడా చూసారు. అక్కడ కుడా సర్వే ఫలితాలు ప్రతికూలంగా రావడంతో శాసన మండలి సభ్యుడిగానే కొనసాగిస్తే బాగుంటుందని అనుకున్నారు. అయితే రాజకీయ వారసత్వం కావాలి అనుకొంటే అసెంబ్లీకి పోటీ చేయడం తప్పని సరి అని పలువురు పార్టీ నాయకులు వత్తిడి తీసుకు వస్తూ ఉండడంతో ఇక ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గాన్నే కుమారుడికి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చిన్నట్లు తెలుస్తున్నది.

1983లో ఓటమి అనంతరం చంద్రబాబునాయుడు తిరిగి చంద్రగిరి వైపు చూడలేదు. అక్కడ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రతిపక్ష అభ్యర్ధులే గెలుపొందుతూ వస్తున్నారు. 1989 నుండి బిసిలు ఎక్కువగా ఉన్న కుప్పం నియోజకవర్గం నుండే గెలుస్తూ వస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి దానిని కంచుకోటగా భావిస్తున్నారు. జిల్లా అంతా ప్రతికూల పవనాలు వీసిన సమయంలో కుడా కుప్పంలో వచ్చిన మెజారిటీ తో చిత్తూర్ లోక్ సభ స్థానాన్ని తెలుగు దేశం గెలుచుకొంటు వస్తున్నది. అందుకనే కుమారుడికి కుప్పం కన్నా మరో సురక్షితమైన స్థానం లేదనే అంచనాకు వచ్చారు.

వాస్తవానికి మంత్రివర్గంలో చేరిన సమయంలోనే మొదటగా శాసన మండలికి ఎన్నిక కావడం భావ్యం కాదని, ఒక స్థానం ఖాళీ చేయించి అసెంబ్లీకే లోకేష్ ను పోటీ చేయించాలని చూసారు. పెనమలూరు ఎమ్యెల్యేతో పాటు పలువురు ఆయన కోసం ఉపఎన్నిక వచ్చేందుకు వీలు కల్పిస్తూ రాజీనామాకు కుడా సంసిద్దతను వ్యక్తం చేసారు. అయితే ఏ స్థానలో పోటీ చేసినా గెలుపొందటం పట్ల అనుమానాలు వ్యక్తం కావడంతో మండలికే పంపారు.

ఇప్పుడు కుప్పం నుండి లోకేష్ ను పోటీ చేయించాలి అనుకొంటూ ఉండడంతో చంద్రబాబునాయుడు తనకు మరో నియోజకవర్గం చూసుకో వలసి వస్తున్నది. ఈ సందర్భంగా విద్యార్ధి నాయకుడిగా తన రాజకీయ జీవితానికి మూలమైన తిరుపతి నుండే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడనుండి పోటీ చేయాలి అనుకొంటున్నట్లు పార్టీలో పలువురికి ముఖ్యమంత్రి సంకేతం ఇచ్చిన్నట్లు తెలిసింది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూర్ అయినప్పటికీ ఆయన నాయకత్వంలో ఎప్పుడూ తెలుగు దేశం పార్టీ మెజారిటీ స్థానాలను గెల్చుకోలేక పోయింది. దానితో తండ్రి, కొడుకులు ఇద్దరు ఆ జిల్లా నుండే పోటీ చేయబోవడం ఒక విధంగా సాహసం కాగలదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

2014లో జరిగిన ఎన్నికల్లోనూ ఆరు స్థానాల్లో మాత్రమే చిత్తూర్ జిల్లాల్లో టిడిపి గెల్చుకొంది. తిరుపతిలో తాను పోటీ చేయడం ద్వారా పోరుగానే ఉన్న శ్రీకాళహస్తి, చంద్రగిరి, జీడినెల్లూరు, నగిరి నియోజకవర్గాలలో కూడా టిడిపి అభ్యర్ధులు గెలుపొందేటట్లు చేయవచ్చని సర్వే నివేదికలు చెప్పిన్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి.