వరద గుప్పిట్లోనే పలు కేరళ జిల్లాలు

అందమైన ఉద్యానవనాలు, పర్యాటక రంగానికి మారుపేరైన కేరళ రాష్ర్టాన్ని భారీ వర్షాలు వదలడం లేదు. పలు జిల్లాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వచ్చిన వరదలకు భారీనష్టం జరిగింది. కేరళ, లక్షద్వీప్ తీరప్రాంతాల్లో గంటకు 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నదన్నది. భారీవర్షాలకు అతలాకుతలమైన ఇడుక్కి జిల్లాలోని ఇ డుక్కి డ్యాంలో నీటిమట్టం గరిష్ఠస్థాయి (2,397.58 అడుగులు)కి చేరడంతో అధికారులు వరుసగా మూడోరోజూ నీటిని దిగువకు వదిలారు.

 

వరదలతో లక్ష మందికి పైగా ప్రజలు నిరాశ్రయులుగా మారగా, వర్షాలతో గతవారం మరణించిన వారి సంఖ్య 39కి చేరింది. వరదల్లో చిక్కుకున్న ఐదు జిల్లాల్లో ఆర్మీ, నౌకాదళం, వైమానిక దళంతోపాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. పలు ఉద్యానవనాలు, తోటలు, పంటలు, భారీ సంఖ్యలో ఇండ్లు తుడిచిపెట్టుకుపోయాయి.

 

సహాయ శిబిరాల్లో ఉన్న విద్యార్థులకు పరీక్షలు ఉన్న నేపథ్యం లో కొత్త పుస్తకాలు, పెన్నులు అందజేసి అక్కడే తరగతులు సైతం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇడుక్కి, మున్నా ర్, కుమరక్కొంల్లో 80% హోటల్ బుకింగ్స్ రద్దయ్యాయని టూర్ ఆపరేటర్ల సంఘం నేత ఈఎం నజీబ్ ఆవేదన వ్యక్తంచేశారు. టీ, కాఫీ, యాలకులు, రబ్బర్ తోటలకు రూ.600 కోట్ల మేర నష్టం జరిగింది.

మరోవంక భారీవర్షాలు, ఆకస్మిక వరదలు హిమాచల్‌ప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న అతి భారీ వర్షాలతో వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 18 మంది మర ణించారని అధికారులు చెప్పారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో వివిధ ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించిందన్నారు.

పలుజిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తమిళనాడులో కావేరీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు 9 జిల్లాల్లో వరదల హెచ్చరికలను జారీచేశారు. వర్షాలు, వరదలతో ఇప్పటివరకు ఏడు రాష్ర్టాల్లో 774 మంది చనిపోయినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది.