నాల్గవ తరం పారిశ్రామిక విప్లవం ప్రారంభం

దేశంలో నాల్గవ తరం పారిశ్రామిక విప్లవం ప్రారంభమైందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. దీని వల్ల యువతకు సమృద్ధిగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సాంకేతిక వృద్ధి కారణంగా ఉద్యోగాలు పోతాయన్న భయం అవసరం లేదని చెబుతూ నాలుగో పారిశ్రామిక విప్లవంతో కొత్త ఉద్యోగాలు వస్తాయని ప్రధాని భరోసా ఇచ్చారు. నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన కేంద్రాన్ని ఢిల్లీలో ప్రారంభించిన సందర్భంగా  ఆయన మాట్లాడుతూ దీంతో వచ్చే ప్రయోజనాలు అందరికి అందుబాటులోకి రావడానికి అనువుగా విధానాలు మార్పిడి చేసుకోవడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.  

పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు విరివిగా రుణాలను బ్యాంకులు ఇచ్చే సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. ఆర్థిక స్వావలంభన, దేశీయ టెక్నాలజీ ద్వారా భారత్‌లో పారిశ్రామిక రంగం, ఆర్థికాభివృద్ధిరేటు పరుగులు తీస్తోందని ప్రధాని చెప్పారు. పారిశ్రామిక విప్లవ ఫలితాలును యువతకు, పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు, నైపుణ్యం ఉన్న కార్మికులకు అందించేందుకు సమగ్ర ప్రణాళికలతో కేంద్రం కదులుతోందని హామీ ఇచ్చారు.

డిజిటల్ రంగంలో వౌలిక సదుపాయాల వల్ల టెక్నాలజీలో కొత్త విప్లవం సాధిస్తున్నామని ప్రధాని తెలిపారు.  భారత్ త్వరలో డిజిటల్ పరిశోధన రంగంలో హబ్‌గా అవతరిస్తుందని చెబుతూ నాల్గవ పారిశ్రామిక విప్లవానికి భారత్ అందిస్తున్న పరిశోధన, నైపుణ్యం చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యానికి గురవుతున్నాయని పేర్కొన్నారు.  ప్రతిభసంపత్తిని సరైన ప్రణాళికలో టెక్నాలజీకి అనుసంధానం చేసి వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

‘మన దేశంలో ఉన్న భిన్నత్వం, మానవ వనరులు, వేగంగా వృద్ధిచెందే మార్కెట్ల పరిమాణం, డిజిటల్ సదుపాయాలు భారత్‌ను పరిశోధనలకు కేంద్రంగా మారుస్తుంది’ అని ఆయన వెల్లడించారు. ‘మొదటి రెండు పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్‌కు స్వాతంత్య్రం లేదు. అలాగే మూడో పారిశ్రామిక విప్లవం సమయంలో స్వాతంత్ర్యానంతర సవాళ్లతో దేశం సతమతమైంది. కానీ ఇప్పుడు నాలుగో విప్లవం ఫలితాలు అద్భుతంగా ఉంటాయి’ అని ప్రధాని వెల్లడించారు.

కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్‌ థింగ్స్, బ్లాక్‌ చెయిన్‌, బిగ్‌ డేటా వంటి సాంకేతికతలు భారత్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని ప్రధాని తెలిపారు. అలాగే బిజెపి ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన ప్రస్తావిస్తూ భారత్ టెలి డెన్సిటీ 93శాతం పెరిగిందని, దాదాపు 50 కోట్ల మంది భారతీయులకు మొబైల్ ఫోన్లు ఉన్నాయని పేర్కొన్నారు.

మన దేశంలో డేటా ధరలు చాలా తక్కువగా ఉన్నాయని, ఈ నాలుగేళ్లలో డేటా వినియోగం 30 శాతం పెరిగిందని తెలిపారు. 2.5 లక్షల పంచాయతీలకు ఆప్టిక్‌ ఫైబర్‌ ఏర్పాటు త్వరలో పూర్తవుతుందని ప్రధాని ప్రకటించారు.  2014లో కేవలం 59 పంచాయతీలకు మాత్రమే ఈ సదుపాయం ఉందని, ఇప్పుడు లక్ష పంచాయతీలకు అందుబాటులో వచ్చిందని పేర్కొన్నారు.