మణిపూర్లో బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిజెపి నేతృత్వంలోని బిరెన్ సింగ్ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తున్న కొన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చింది. ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసింది.
తమ పార్టీకి చెందిన నలుగురు మంత్రుల చేత ఎన్పీపీ రాజీనామా చేయించింది. వీరిలో డిప్యూటీ సీఎం జోయ్కుమార్ సింగ్ కూడా ఉన్నారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వంకు మద్దతిస్తున్న మరో నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.
బిజెపికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. దానితో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్ధకరంగా మారింది.
మరో ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు ఎస్.సుభాష్ చంద్ర సింగ్, టిటి.హోకిప్, శామ్యూల్ జెండారులు పార్టీకి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రాబింద్రో సింగ్, స్వతంత్ర ఎమ్మెల్యే షాహాబుద్దీలు కూడా బిజెపికి తమ మద్దతును ఉపసంహరించుకున్నారు.
మరోవైపు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేంతా ప్రతిపక్ష కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడం ఊహించని పరిణామం. ఈ క్రమంలోనే అసెంబ్లీలో బలనిరూపణ చేపట్టాలని కోరుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పక్షనేత ఇబోబీ సింగ్ గవర్నర్తో భేటీకి సిద్దమయ్యారు. రాజ్యసభ ఎన్నికల ముందు బీజేపీకి ఈ పరిణామం ఊహించనిది.
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకుగాను 28 సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే కేవలం 21 స్థానాలు గెలిచిన బీజేపీ ఇతరులను తమ వైపుకు తిప్పుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు ఇతరుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది.