బిజెపిలో రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి

తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం రాజనరసింహ సతీమణి పద్మినిరెడ్డి అనూహ్యంగా బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర అద్యక్షుడు డా. కె లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావుల సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.

పలు సంవత్సరాలుగా రాజకీయ రంగ ప్రవేశం పట్ల ఆసక్తి కనబరుస్తున్న ఆమె 2014 ఎన్నికలకు ముందు సంగారెడ్డి నుండి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేసారు. అప్పటి కాంగ్రెస్ స్థానిక ఎమ్యెల్యే జగ్గారెడ్డి పై పలు విమర్శలు చేస్తూ కాంగ్రెస్ అధినాయకత్వానికి కుడా ఫిర్యాదు చేసారు.

బీజేపీలో పద్మినీరెడ్డి చేరికతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. పద్మినీరెడ్డి భర్త దమోదర రాజనర్సింహ ప్రస్తుతం కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్నారు.

ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తూ తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే మహిళల రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పారు. ఆ అంశాన్ని తమ ఎన్నికల ప్రణాళికలో చేరుస్తున్నట్లు కుడా తెలిపారు.

ఆమె వంటి వారు పార్టీలో చేరడంతో తెలంగాణలో బిజెపి మరింతగా బలోపేతం అవుతుందని మురళీధరరావు విశ్వాసం వ్యక్తం చేసారు. పలు సేవా కార్యక్రమాల్లో, ముఖ్యంగా దేవాలయాల పునరుద్ధరణలో ఆమె కృషిని కొనియాడారు.

దామోదర రాజనర్సింహ సొంత ఇంట్లోనే వేరు కుంపటి మొదలవడంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. వరుస అసమ్మతులతో కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో పడిపోయింది. ఊహించని పరిణామంతో కాంగ్రెస్ అయోమయంలో పడింది. పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పుకోలేని స్థితిలో రాజనర్సింహ ఉన్నట్లు తెలుస్తున్నది.