అమెరికాలో రూ.1.68 లక్షల కోట్ల భారతీయ పెట్టుబడులు

అక్కడి మూలాలు కలిగినవారి సంస్థలు అమెరికా  అభ్యున్నతికి దోహదపడుతున్న తీరును సీఐఐ తాజా సర్వే ఆవిష్కరించింది. అమెరికాలో ఉన్న 155 భారతీయ సంస్థలు రూ.1.68 లక్షల కోట్ల (22 బిలియన్‌ డాలర్లకుపైగా) పెట్టుబడులు పెట్టాయని వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ తెలిపింది. 

అమెరికా వ్యాప్తంగా వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ సంస్థలు సుమారు 1.25 లక్షల మందికి ఉద్యోగాలనిచ్చాయని వెల్లడించింది. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌సహా చాలా దేశాలు అమెరికాకు ఏమీ చేయడం లేదని తరచూ నోరు పారేసుకుంటున్న నేపథ్యంలో ఈ సర్వే మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నది. 

‘అమెరికా మట్టిలో భారతీయ మూలాలు 2020’ పేరుతో సీఐఐ ఓ నివేదికను విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్న ఈ 155 భారతీయ సంస్థల ద్వారా ఉద్యోగాలు పొందిన టాప్‌-5 అమెరికన్‌ రాష్ట్రాల్లో  టెక్సాస్‌ (17,578), క్యాలిఫోర్నియా (8,271), న్యూజెర్సీ (8,057), న్యూయార్క్‌ (6,175), ఫ్లోరిడా (5,454) ఉన్నాయి. 

భారతీయ సంస్థల కోసం మరింత అనువైన వాతావరణాన్ని, అనుకూల విధానాలను అమెరికా ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉన్నదని  సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌తో తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇప్పుడిది ఎంతో ముఖ్యమని చెప్పారు. 

అమెరికాలో భారతీయ పరిశ్రమ చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులను పెడుతున్నదని అమెరికాలో భారత రాయబారి తరన్జిత్‌ పేర్కొన్నారు.  పరిశోధన, అభివృద్ధి రంగాల్లోనూ భారత్‌ పెట్టుబడులుండటం గమనార్హంటెక్సాస్‌లో అత్యధికంగా 9.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను భారతీయ కంపెనీలు పెట్టాయి. ఆ తర్వాత న్యూజెర్సీ (2.4 బిలియన్‌ డాలర్లు), న్యూయార్క్‌ (1.8 బిలియన్‌ డాలర్లు), ఫ్లోరిడా (915 మిలియన్‌ డాలర్లు), మసాచుసెట్స్‌ (873 మిలియన్‌ డాలర్లు) రాష్ట్రాలున్నట్లు సర్వే తెలిపింది. 

భారతీయ సంస్థల దృష్టి ఎక్కువగా న్యూజెర్సీ, టెక్సాస్‌, క్యాలిఫోర్నియా, న్యూయార్క్‌, ఇల్లినాయిస్‌, జార్జియా రాష్ట్రాలపైనే ఉందని కూడా సర్వేలో తేలింది. ఔషధ, లైఫ్‌ సైన్సెస్‌, టెలీకమ్యూనికేషన్స్‌, ఏరోస్పేస్‌, రక్షణ, ఆర్థిక సేవలు, తయారీ, పర్యాటక, ఆతిథ్య, డిజైన్‌, ఇంజినీరింగ్‌, ఆటోమోటివ్‌, ఆహార, వ్యవసాయ, ఇంధన, గనులు, మెటీరియల్స్‌ రంగాలకు చెందిన సంస్థలు తాజా సర్వేలో తమ అభిప్రాయాలను పంచుకున్నాయి.

77 శాతం సంస్థలు అమెరికాలో మరిన్ని పెట్టుబడులకు యోచిస్తుండగా, 83 శాతం కంపెనీలు రాబోయే ఐదేండ్లలో స్థానికులకు ఇంకా ఉద్యోగావకాశాలను కల్పించాలని చూస్తున్నాయి.