కరోనా రోగుల పాలిట సంజీవని డెక్సామెథాసోన్

మృత్యువుతో పోరాటం చేసే రోగుల పాలిట సంజీవని లాంటి దివ్యౌషధం అంటూ  బ్రిటన్ శాస్త్రవేత్తలు ఎప్పటి నుండో అందుబాటులో ఉన్న  డెక్సామెథాసోన్ అనే  డ్రగ్ ను ప్రకటించారు. తక్కువ ఖరీదుతో విస్తృతంగా లభించే ఈ మందుకు కరోనా వైరస్‌తో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రోగులను బతికించే శక్తి ఉందని వారు ప్రకటించారు.

తక్కువ డోసేజీతో ఇచ్చే ఈ స్టెరాయిడ్ ట్రీట్‌మెంట్ ప్రాణాంతక కరోనావైరస్‌పై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న యుద్ధంలో గొప్ప విజయమని వారు అభివర్ణిస్తున్నారు. ఆక్సిజన్ చికిత్స తీసుకుంటున్న రోగులలో ఐదు రెట్లు, వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న రోగులలో ఐదు రెట్లు మరణాల సంఖ్యను ఈ డ్రగ్ తగ్గించగలదని వారు భరోసా వ్యక్తం చేస్తున్నారు. 

కరోనా వైరస్‌ను అంతం చేసే ప్రయోగాలలో భాగంగా యుకె శాస్త్రవేత్తలు డెక్సామెథాసోన్ డ్రగ్‌పై పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్ మహమ్మారి బ్రిటన్‌లోకి ప్రవేశించిన వెంటనే ఈ మందును రోగులకు వాడి ఉంటే ఇప్పటివరకు 5,000 మందికి పైగా ప్రాణాలు కాపాడగలిగి ఉండేవారమని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 

తక్కువ ధరకే లభించే ఈ మందు కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతున్న పేద దేశాలకు ఎంతో ప్రయోజనకరమని వారు తెలిపారు. కరోనా వైరస్ బారిన పడిన ప్రతి 20 మంది రోగులలో దాదాపు 19 మంది ఆసుపత్రులలో చేరకుండానే కోలుకుంటున్నారు. ఆసుపత్రులలో చేరినవారిలో కూడా చాలా మంది కోలుకుంటున్నారు. 

అయితే వీరిలో కొందరికి ఆక్సిజన్ అమర్చాల్సిన అవసరం ఏర్పడుతుండగా మరికొందరికి వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సి వస్తుంది. ఇతర వ్యాధుల కారణంగా ఏర్పడే వాపులు, నొప్పులు, చర్మం ఎర్రగా కందిపోవడం, వాపు ఉన్న చోట వేడిగా ఉండడం వంటి లక్షణాలకు ఈ డ్రగ్‌ను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు.

వైరస్‌ను ఎదుర్కొనే ప్రయత్నంలో శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ బలహీనపడినపుడు అవయవాలకు నష్టం జరగకుండా ఈ డ్రగ్ అడ్డుకోగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. డెక్సామెథాసోన్ స్టెరాయిడ్ 1960వ దశకం ప్రారంభం నుంచే అందుబాటులో ఉంది. ఈ డ్రగ్‌ను రుమాటాయిడ్ ఆర్త్రయిటిస్ (కీళ్ల నొప్పులు), ఆస్తమా తదితర రోగాల చికిత్సకు ఈ డ్రగ్ ఉపయోగిస్తున్నారు. 

ఐసియులో ఉన్న రోగులకు ఇంట్రావీనస్ ద్వారా అంత ప్రమాదకర పరిస్థితిలో లేని రోగులకు టాబ్లెట్ రూపం లో ఈ డ్రగ్‌ను ఇవ్వడం జరుగుతోంది.