ఢిల్లీలో ప్రపంచంలోనే పెద్ద కరోనా చికిత్స కేంద్రం

హోమ్ మంత్రి అమిత్ షా స్వయంగా సమీక్ష జరిపి ఢిల్లీలో కరోనా మహమ్మారి కట్టడికి చర్యలను ముమ్మరం కావించే చర్యలు చేపట్టిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వం సహితం మరింత వేగం పెంచింది. వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద చికిత్స కేంద్రంను సిద్ధం చేస్తున్నది. 

దక్షిణ ఢిల్లీలోని 10,000 పడకల సామర్ధ్యం గల రాధా సోమీ స్పిరిచ్యువల్ సెంటర్ ను కరోనా రోగుల ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా మారుస్తోంది. ఛతార్ పూర్ లో12,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రాధా సోమీ స్పిరిచ్యువల్ సెంటర్ 22 ఫుట్‌బాల్ గ్రౌండ్స్ విస్తీర్ణానికి సమానంగా ఉంటుంది. 

ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మూడు లక్షల మందికి పైగా పాల్గొంటారు. ఈ ప్రాంతమంతా సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. దీంతో కరోనా చికిత్స కేంద్రంగా ఈ కేంద్రాన్ని మార్చాలని నిర్ణయించిన ఢిల్లీ ప్రభుత్వం అందుకు కావాల్సిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కేర్ మార్గదర్శకాల ప్రకారం ఇక్కడి సదుపాయాలు ఉన్నాయని, 500 పడకల సామర్ధ్యం గల 20 ఆసుమంత్రుల  మాదిరిగా ఈ సెంటర్ పనిచేస్తుందని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న దక్షిణ ఢిల్లీ కలెక్టర్ బీఎమ్ మిశ్రా తెలిపారు. 

అత్యవసర రోగులకు  సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రిఫర్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కేంద్రంలో అంబులెన్సులు, టెస్టులు నిర్వహించేందుకు సొంత ల్యాబ్ ఫెసిలిటీలున్నాయని చెప్పారు. 

రెండు షిఫ్టులలో 400 మంది చొప్పున డాక్టర్లు పనిచేస్తారని తెలిపారు. పర్యవేక్షించేందుకు పారామిలిటరీ ఫోర్సెస్ పనిచేస్తాయన్నారు. ప్రస్తుతం కంప్యూటర్లు ఏర్పాటు చేస్తున్నామని,  జూన్ నెలాఖరు నాటికి ఈ సెంటర్ కరోనా ట్రీట్​మెంట్​కు రెడీ అవుతుందని వివరించారు. 

‘‘రాధా సోమీ సెంటర్ లో ప్రత్యేకతలు ఏంటంటే.. ఇక్కడన్నీ కార్డ్ బోర్డ్ బెడ్స్ ఉంటాయి. కార్డ్ బోర్డ్ పై 24 గంటల కన్నా ఎక్కువ సేపు వైరస్ నిలవదు కాబట్టి వీటిని శానిటైజ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే వాటిని రీసైకిల్ చేసుకోవచ్చు. బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా సులువుగా మార్చుకోవచ్చు” అని వీటిని తయారు చేసిన ధావన్ బాక్స్ షీట్ కంటెయినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ విక్రమ్ ధావన్ చెప్పారు.

‘‘లాక్​డౌన్ అమల్లోకి వచ్చాక ఈ సెంటర్ లో ఎంతోమంది కూలీలకు ఆశ్రయం కల్పించాం. ఇప్పటికే కొంతమంది వలస కార్మికులకు ఆశ్రయం పొందుతున్నారు. కమ్యూనిటీ కిచెన్ సెంటర్ల ద్వారా ఇక్కడ ఒకేసారి వేలాది మందికి భోజనం అందించగలిగే వెసులు బాటు ఉంది” అని రాధా సోమి సత్సంగ్ బియాస్ కార్యదర్శి వికాస్ సేథి తెలిపారు.