జాత్యహంకారం మాత్రమే కాదు

* చలసాని నరేంద్ర 

అమెరికా నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ పోలీసుల చేతిలో చనిపోవడం పట్ల అమెరికా వ్యాప్తంగా నిరనసలు పెల్లుబుకుతున్నాయి. ఒకానొక దశలో ఆందోళనలు వైట్‌హౌజ్‌కు చేరడంతో అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బంకర్‌లో దాక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.  

ఈ పరిస్థితులు కుదుట పడుతున్నతరుణంలో  అట్లాంటాలో మరో నల్లజాతీయుడు 27 ఏండ్ల రేషార్డ్‌ బ్రూక్స్‌  పోలీసులు కాల్చిచంపడంతో  ఆ దేశంలో నిరసనలు మరింత తీవ్రమయ్యాయి. 

అయితే వీరిద్దరూ పోలీసుల కాల్పులలో చనిపోవడంతో దీనిని పోలీసులు - నల్లజాతీయులు మధ్య ఘర్షణగా, జాత్యంకార పొలిసు వ్యవస్థ కారణంగా ఇటువంటి హింస చెలరేగుతున్నట్లు కధనాలు వెలువడుతున్నాయి. ఆ విధంగా చూడడం అమెరికా సమాజం ఎదుర్కొంటున్న జటిల సమస్యను పక్కదారి పట్టించడమే కాగలదు. 

అర్ధ శతాబ్ది కాలం తర్వాత అమెరికాలో నల్లవారు ఇంత తీవ్రంగా ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. మరో కొన్ని నెలల్లో అధ్యక్ష ఎన్నికలు ఉండడంతో సహజంగానే మరింత ఉద్రిక్తలు చెలరేగడానికి దారితీస్తున్నది. అయితే ఈ ఘర్షణలు అమెరికాలో వ్యవస్థీకృతమైన జాత్యంహకారానికి నిదర్శనమని ఒప్పుకోవలసిందే. 

ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఫ్రెంచ్ విప్లవంలో ముందుకొచ్చిన స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం ప్రాతిపదికగా అమెరికా సమాజం ఏర్పడింది. అయితే తొలి నుండి నల్లజాతీయులు వివక్షతకు గురవుతూనే ఉన్నారు. అందుకు ప్రధాన కారణం వారు  విద్యాపరంగా, ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడి ఉండటమే. 

న్యాయ వ్యవస్థలో, పోలీస్ వ్యవస్థలో నల్లవారి పట్ల వివక్షత నెలకొనడం కూడా తెలిసిందే. ఒకే నేరం చేస్తే తెల్లవారికి, నల్లవారికి భిన్నంగా శిక్షలు పడతాయని స్వయంగా  అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో బరాక్ ఒబామా చెప్పారు. అయితే ప్రస్తుతం చెలరేగుతున్న అల్లర్లు ఎక్కువగా నల్లజాతీయులు రాజకీయంగా కీలక స్థానాలలో ఉన్న నగరాలలోనే జరుగుతూ ఉండడం గమనార్హం. 

నల్లవారిపై వివక్షతను, పోలీస్ జులుంను తెల్లవారు కూడా ఖండిస్తున్నారు. నిరసన ప్రదర్శనలలో తెల్ల యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. దానితో నేడు అమెరికా ఎదుర్కొంటున్న సమస్య జాత్యహంకారానికి మించిన సుపరిపాలన సమస్య అని చెప్పవచ్చు. 

పోలీసులు సహజంగానే ప్రజాస్వామ్య దేశాలలో జవాబుదారీతనం లేకుండా, అమాయక ప్రజలపై జులుం ప్రదర్శించడం జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరంలోనే అమెరికాలో పోలీసుల చేతులలో 88 మంది నల్లవారు మాత్రమే చనిపోతే 172 మంది తెల్లవారు చనిపోవడం గమనార్హం. అంటే పోలీసుల దురంహకారానికి తెల్లవారు కూడా బలవుతున్నారని గమనించాలి. 

ఎక్కువగా ప్రముఖ నగరాలలోని ఇటువంటి జాత్యంహకార దాడులు జరుగుతూ ఉన్నాయి. సెయింట్ లూయిస్, డిట్రాయిట్, ఓక్లాండ్, చికాగో, మెంఫిస్, అట్లాంటా, బ్రిల్మింగ్ హమ్, నెవార్క్, బఫెలో, ఫిహెలడెల్ఫియా నగరాలలో ఎక్కువగా జరిగాయి. ఈ నగరాలన్నీ దశాబ్దాలుగా డెమొక్రాట్స్ పాలనలో ఉండటం గమనార్హం.

డిట్రాయిట్, బఫెలో, నెవార్క్, ఫిలడెపలఫియా వంటి నగరాలలో అర్ధశతాబ్దిగా ఒక్కసారి కూడా రిపబ్లిక్ వారు ఎన్నిక కాలేదు. వీటిల్లో అనేక నగరాలలో నల్లజాతీయులు మేయర్ లుగా ఉన్నారు. నగర కౌన్సిల్ లలో ఆధిక్యతతో ఉన్నారు. పోలీస్ చీఫ్ గా, స్కూల్స్ సూపరింటెండెంట్ గా ఉన్నారు. నల్లవారు ఎక్కువగా డెమోక్రాటిక్ పార్టీకే ఓట్లు వేస్తుంటారు. 

1965 తర్వాత అమెరికాలో రాజకీయంగా నల్లజాతీయులు ప్రాధాన్యత వహిస్తూ వస్తున్నారు. అప్పుడు అమెరికా సెనేట్ లో ఒక్కరు కూడా వారు లేరు. ఒక్కరు కూడా గవర్నర్ గా లేరు. ప్రతినిధుల సభలో ఆరుగురు మాత్రమే నల్లజాతీయులు ఉన్నారు. కానీ ఇప్పటి పరిస్థితి మారింది. 

అమెరికాకు అధ్యక్షుడిగా బరాక్ ఒబామా అయ్యారు. ఇప్పుడు సైన్యాధిపతి కూడా కాబోతున్నారు. 2019లో ప్రతినిధుల సభలో 52 మంది ఉన్నారు. సెనేట్ లో 9 మంది ఉన్నారు. ముగ్గురు గవర్నర్లుగా ఉన్నారు. నేడు నల్లజాతీయులకు  చెప్పుకోదగిన రాజకీయ అధికారం లభిస్తున్నా ఎక్కడ వివక్షత ఎదురవుతున్నది? 

డెమొక్రాట్ల ఆధీనంలో ఉన్న నగరాలలో ప్రతి ఏడాది విద్యకు బడ్జెట్ పెరుగుతున్నా అందిస్తున్న విద్య నాణ్యత చాల చవకబారుగా ఉంటున్నది. ఉదాహరణకు, 2016లో బాల్టిమోర్ లోని 39 ఉన్నత పాఠశాలలో ఒక్క విద్యార్థికి కూడా గణితం పరీక్షలో చెప్పుకోదగిన మార్కులు రాలేదు. మరో ఆరు పాఠశాలలో కేవలం 1 శాతం మందికి మాత్రమే మంచి మార్కులు వచ్చాయి. 15 శాతం మంది మాత్రమే ఇంగ్లీష్ లో ఉత్తీర్నులయ్యారు. . 

చదువులు చతికలబడడంతో పాటు, హింసాయుత వాతావరణం కూడా పెరుగుతూ ఉండడమతొ ఈ నగరాలలో ఆహ్లాదకరమైన వాతావరణం లోపించి ఆర్ధిక ప్రాతిపదిక కూడా లోపిస్తుంది. గత 50 ఏళ్లుగా ఈ నగరాలలో జనాభా గణనీయంగా తగ్గిపోతున్నది. కొన్ని నగరాలలో అయితే సగానికి సగం తగ్గింది. జనాభా తగ్గిపోవడానికి జాత్యహంకారమే కారణం అని ఉదారవాదులు, పౌరహక్కుల నిపుణులు, ఇతరులు నిందిస్తున్నారు.

కానీ ఈ నగరాలలో తెల్లవారికన్నా నల్లవారే ఎక్కువగా విడిచి వెళ్లిపోతున్నారు. వీరు కేవలం తమ పిల్లలకు మంచి చదువు కోసం, తమ ఆస్తులు విధ్వంసంకు గురికాకుండా కాపాడుకోవడం కోసమే వెళ్ళుతున్నారని జార్జ్ మీసోన్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వాల్తేర్ ఇ విల్లియమ్స్ స్పష్టం చేశారు. నేటి సంక్షోభానికి పోలీసులను నిందించడం తగదని ఈ నల్లజాతి ఆచార్యులు చెబుతున్నారు.

అయితే ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న హింస, విధ్వంసాల వెనుక అదృశ్య హస్తాలు ఉన్నట్లు కూడా కధనాలు వెలువడుతున్నాయి. ప్రముఖ నల్లజాతి నేతలు అందరూ ఈ మతిలేని హింసను ఖండిస్తున్నారు. శాంతియుతంగానే తాము నిరసనలు జరుపుతున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ హింసతో తమకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. 

ఈ హింస రాజకీయ ప్రేరేపితమని, నల్లజాతీయులు ఆవేదనతో సంబంధం లేదని ఈ సందర్భంగా వెల్లడి అవున్నది. వామపక్ష తీవ్రవాద శక్తులు వీటి వెనుక ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా పేర్కొనడం గమనార్హం. '

అసలుకే కోవిడ్ -19 మహమ్మారితో అమెరికా ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నది నల్లజాతీయులే. కరోనా వైరస్ కు గురయి, మరణించింది కూడా వారే ఎక్కువగా ఉన్నారు. అటువంటప్పుడు ఈ హింస ద్వారా వారి ఆర్ధిక మూలలను మరింతగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. వీటి ప్రభావం దీర్ఘకాలికంగా ఉండే అవకాశం ఉన్నదని నల్లజాతీయులు నేతలే ఆందోళన చెందుతున్నారు. 

(మన తెలంగాణ నుండి)