అచ్చంనాయుడు అరెస్ట్ చంద్రబాబు, లోకేష్ కోసమా!

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి నాలుగు రోజుల ముందు టిడిపి శాసనసభా పక్షం డిప్యూటీ నేత కె అచ్చంనాయుడును ఎసిబి పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక అసలు లక్ష్యం అవినీతి ఆరోపణలతో టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ లపై సహితం అవినీతి ఆరోపణలు చేయడం కోసం చేస్తున్న ప్రక్రియలో భాగమని తెలుస్తున్నది. 

అచ్చంనాయుడును అరెస్ట్ చేయడానికి ముందు రోజననే టిడిపి హయాంలో అమలు చేసిన వివిధ పథకాలలో జరిగిన అవినీతిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం గమనార్హం. అచ్చంనాయుడు అరెస్ట్ జరిగిన మరుసటి రోజుననే మాజీ ఎమ్యెల్యే జేసీ ప్రభాకర రెడ్డి, అయన కుమారులను అరెస్ట్ చేశారు. 

టిడిపికి బలమైన నాయకులను వివిధ జిల్లాలో ఇటువంటి అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేయబోతున్నట్లు ఆయా జిల్లాల్లో వైసిపి నాయకులు పత్రికా సమావేశాలలో బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ఈ సందర్భంగా సోమవారం పలువురు వైసిపి నేతలు అవినీతి కేసులలో చంద్రబాబు నాయుడు, లోకేష్ లు కూడా అరెస్ట్ కావడం తథ్యం అంటూ ప్రకటనలు ఇవ్వడం ఈ సందర్భంగా గమనార్హం. 

ఈఎస్‌ఐ అవినీతిలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు కూడా వాటా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ బహిరంగంగా ఆరోపించారు. ఈ సందర్భంగా వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి అచ్చంనాయుడుకు ఒక సలహా యివ్వడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. 

టిడిపి నేతలు అందరు చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు బినామీలు అని చెబుతూ వారి బండారం బైట పెట్టడం ద్వారా ఈ కేసు నుండి అచ్చంనాయుడు  బయటపడవచ్చని సూచించారు. వైసీపీ నేతల అసలు లక్ష్యం వారిద్దరిని అరెస్ట్ చేయడమే అని విజయసాయిరెడ్డి మాటలు స్పష్టం చేస్తున్నాయి.

‘‘ అచ్చెన్న తమ గుట్లన్నీ బయటకు కక్కుతాడేమో అన్న భయంతో అబ్బా కొడుకులకు నిద్ర పట్టడం లేదంట. విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.    

అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్‌రెడ్డి అవినీతి చేసి అడ్డంగా దొరికి పోయారని  వీరు  నోరు విప్పితే చంద్రబాబు, లోకేశ్‌ల బండారం వెలుగు చూస్తుందని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు.   ఈ కేసులో ఇంకొంత మంది `పెద్దల' ప్రమేయం కూడా ఉందని హోమ్ మంత్రి సుచరిత చెప్పారు. 

కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ మధ్య టీడీపీ వార్షిక సమావేశం  మహానాడునను  చంద్రబాబు నాయుడు జూమ్‌ యాప్‌లో జరపడాన్ని ప్రస్తావిస్తూ  వచ్చే ఏడాది జైలులో చేసుకోవాల్సిందే అని వైసిపి ఎమ్యెల్యే గుడివాడ అమర్‌నాధ్‌ ఎద్దేవా చేశారు.  

చంద్రబాబు చేసిన అవినీతి సామ్రాజ్యం ఇప్పుడు బయటపడుతోందని అచ్చంనాయుడు అరెస్ట్ గురించి ప్రస్తావిస్తూ మంత్రి అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు. అవినీతిపరుల జాబితా ఇంకా ఉందని, తప్పు చేసిన వారెవరిని వదిలిపెట్టబోమని చెబుతూ తమ అసలు లక్ష్యం వేరే ఉన్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.