బీజేపీ ఉద్యమంతో కరోనా టెస్ట్ లపై కేసీఆర్ చూపు 

కరోనా టెస్ట్ లను పూర్తిగా తగ్గించి, మౌలిక వైద్య సదుపాయాలను, కేంద్ర మార్గదర్శక సూత్రాలను పట్టించుకోకుండా గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా విశృంఖలంగా వ్యాప్తి చెందడంతో బీజేపీ చేపట్టిన `సేవ్ హైదరాబాద్' ఉద్యమంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిలో కదలిక బయలుదేరింది.  

హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రాబోయే వారం, పది రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 

ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తంగా కేసీఆర్ ప్రభుత్వం చేసిన కరోనా పరీక్షలు 40,000 మాత్రమే . ఇప్పుడు అంతకు రెట్టింపుగా పరీక్షలు జరపాలని అనుకొంటున్నారు. ప్రస్తుతం దేశం మొత్తం మీద కరోనా పరీక్షలలో అట్టడుగున ఉన్న తెలంగాణ కరోనా మరణాల దామాషాలో మాత్రం అగ్రస్థానంలో ఉండడం గమనించాలి.  

ఈ విషయమై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి  ప్రీతి సుడాన్ ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ వ్రాసారు. పైగా, గ్రేటర్ హైదరాబాద్, పరిసరాల ప్రాంతాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా వీడియో సమావేశం జరిపారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కూడా కేసీఆర్ కు లేఖ వ్రాసారు. 

అయినా ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో రాష్ట్ర బిజెపి నేతలు `సేవ్ హైదరాబాద్' ఉద్యమం చేపట్టి, కేసీఆర్ ను కలసి పరిస్థితిని వివరించాలని అనుకున్నారు. ఆయన అపాయింట్మెంట్ కోరి, రెండు రోజులు వేచిచూసినా సమాధానం రాకపోవడంతో నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లి సీఎంకు పరిస్థితి వివరించాలని నిర్ణయించారు. 

అయితే ముందుగానే మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్, శాసనసభ పక్ష నాయకుడు  రాజాసింగ్ లను గృహ నిర్బంధం చేశారు. శాసనమండలి పక్ష నేత  ఎన్ రామచంద్రరావును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు సీఎంను కలసి సమస్యలు విన్నవించడం మన సంప్రదాయం. కానీ ఈ సీఎం ప్రగతి భవన్ లేదా ఫార్మ్ హౌస్ లకే పరిమితమవుతూ, ఎవ్వరిని కలవకుండా రాజరిక ధోరణి ప్రదర్శిస్తున్నారు. 

దానితో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు వివరిస్తూ, కరోనాను అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైనదని స్పష్టం చేస్తూ, వెంటనే కేంద్రం జోక్యం చేసుకొని ఇక్కడి పరిష్టితులను చక్కబెట్టాలని కోరుతూ డా. లక్ష్మణ్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి డా. హర్షవర్ధన్ లకు లేఖలు వ్రాసారు. 

దానితో పరిస్థితులు అదుపుతప్పుతున్నట్లు ముఖ్యమంత్రి గ్రహించినట్లున్నారు. ముందుగా కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించడం గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో కరోనా వైరస్ అదుపుతప్పిన్నట్లు, ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేసినందున విషమ పరిస్థితులు ఏర్పడుతున్నట్లు అంగీకరించినట్లే కాగలదు. 

అదే విధంగా బిజెపి కోరిన విధంగా ఐసిఎంఆర్ అనుమతించిన ప్రైవేట్ ల్యాబ్ లలో కరోనా పరీక్షలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ ఆసుపత్రులను సహితం కరోనా రోగులకు వైద్య సేవలు అందించమని చెప్పడం మంచి పరిణామం. 

ఇదే సమయంలో గాంధీ హాస్పిటల్ లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై కూడా సీఎం దృష్టి సారించవలసి ఉంది. నగరంలోని ఉస్మానియా, ఇతర ప్రభుత్వ ఆసుపత్రులలో సహితం కరోనా చికిత్సలు చేసేవిధంగా చూడాలి. 

గచ్చిబౌలి స్టేడియం లో 1500 పథకాలు సిద్ధం చేసామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొంటున్న సీఎం అక్కడ అవసరమైం వైద్య సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేసి, చికిత్సలు  ప్రారంభించవలసి ఉంది.