కరోనా వేళ ఐఐటిల అద్భుత ఆవిష్కరణలు 

దేశం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయంలో భారత దేశంలోని ఐఐటి లు అద్భుతవమైన ఆవిష్కరణలు జరిపి చాల తక్కువ ధరకు పోర్టబుల్ వెంటిలేటర్లు, కరోనా టెస్టు కిట్లు, శానిటైజింగ్ డ్రోన్లు, ప్రత్యేక డిజిటల్ స్టెతస్కోప్‌లు, వైరస్ నిరోధక బట్టలు అందుబాటులో తెస్తున్నాయి. ఇప్పుడు ఇవి మార్కెట్‌లో అందుబాటు లోకి రాడానికి సిద్ధంగా ఉన్నాయి. 

కరోనా వ్యాపించిన కష్ట కాలంలో గత మూడు నెలల్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటిఎస్)వీటిని రూపొందించాయి. వీటిలో కీలకమైనవి ఐఐటి సంబంధిత అంకుర పరిశ్రమలు, లేదా ప్రధాన సంస్థల ద్వారా మార్కెట్ లోకి ప్రవేశించనున్నాయి. ఈ ఆవిష్కరణలన్నీ తమ పేటెంట్ హక్కులు నిలబెట్టుకునేలా ఆయా కంపెనీలకు లైసెన్సులు జారీ అయ్యాయి. 

కరోనా టెస్ట కిట్‌ను రూపొందించిన ఐఐటి ఢిల్లీ, ఐసిఎంఆర్ నుంచి ఆమోదం పొందిన మొదటి విద్యాసంస్థ. ఈ కిట్ ఒక్కొక్కటి రూ.500 వంతున విక్రయించడానికి బెంగళూరు బయోటెక్ సంస్థ జెనీ లాబొరేటరీస్‌కు లైసెన్సు వచ్చింది. విశాఖపట్టణంలో ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ (ఎఎంటిజెడ్)లో తయారయ్యే ఈ కిట్లు మరో పది రోజుల్లో మార్కెట్‌కు రానున్నాయి. 

ఢిల్లీ ఐఐటి రూపొందించిన మరో ఆవిష్కరణ వ్యాధి నివారణ బట్టలు (ఇన్‌ఫెక్షన్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ ). వీటిని ఢిల్లీ, ఎన్‌సిఆర్‌ల్లోని ఆస్పత్రులకు పంపారు. దుప్పట్లు, తెరలు, యూనిఫారాల రూపంలో ఫేబియోసిస్ ఇన్నొవేషన్స్ పేరున వీటని తయారు చేశారు. ఎయమ్స్‌లో మొదట వీటిని పరీక్షించారు. 

ఐఐటి బొంబే డిజిటల్ స్టెతస్కోప్‌ను తయారు చేసింది. చాలా దూరం నుంచి గుండె చప్పుళ్లను విని రికార్డు చేయగలదు. కరోనా రోగులకు దూరంగా ఉండి వైద్య సిబ్బంది విధులను నిర్వర్తించడానికి ఇది తోడ్పడుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇది లభ్యమౌతోంది. 

ఆయూడివైస్ అనే అంకుర పరిశ్రమ దాదాపు వెయ్యి స్టెతస్కోపులను దేశం లోని ఆస్పత్రులకు, ఆరోగ్యకేంద్రాలకు పంపింది. ఇది అనేక సోర్లలో లభిస్తోంది.

ఐఐటి గువాహటి కి చెందిన మారట్ డ్రోన్‌టెక్ అనే అంకుర పరిశ్రమ రెండు రకాల డ్రోన్లను తయారు చేసింది. తెలంగాణ ప్రభుత్వం,వివిధ విభాగాలు వీటిని ఉపయోగిస్తున్నాయి.  కరోనా వ్యాప్తి చెందకుండా బహిరంగ ప్రదేశాల్లో క్రిమిసంహారక మందులను ఈ డ్రోన్లతో స్ప్రే చేస్తారు. 

సంప్రదాయ పద్ధతి కన్నా 50 రెట్లు ఈ డ్రోన్ ద్వారా స్ప్రే జరుగుతుంది. ప్రజలను అప్రమత్తం చేసే హెచ్చరికల డ్రోన్లను కూడా తయారు చేశారు. వీటికి స్పీకర్లు, కెమెరాలు కూడా అమర్చి ఉంటాయి. కరోనా నివారణ చర్యలు, సూచనలపై స్పీకర్ల ద్వారా ఇవి ప్రజలను హెచ్చరిస్తుంటాయని ఐఐటి గువాహటి కి చెందిన ప్రేమ్‌కుమార్ విశ్వనాధ్ చెప్పారు. 

ఈ సంస్థ ఆస్పత్రుల ఫర్నిచర్‌ను తక్కువ ఖరీదుతో లభ్యమయ్యేలా వెదురుతో తయారు చేస్తుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, తాత్కాలిక వైద్య కేంద్రాల్లో వీటిని వినియోగిస్తారు. వెదురుతో తయారయ్యే పడకలు రోజుకు 200 వరకు తయారవుతుంటాయి. 

ఐఐటి కాన్పూర్ ఐసిఐసిఐ తో సమన్వయమై తక్కువ ఖరీదులో లభించే వెంటిలేటర్‌ను తమ విద్యార్థులచే రూపొందించ గలిగింది. ఈ వెంటిలేటర్ ఆస్పత్రిలో క్రిములను నాశనం చేసే శాటిటైజర్‌గా కూడా ఉపయోగపడుతుంది. 

సాధారణంగా వెంటిలేటర్ ఖరీదు రూ. 4 లక్షలు కాగా, స్వదేశీ తయారీ కావడంతో కేవలం రూ. 70,000 కే ఇది లభిస్తుందని ఐఐటి కాన్పూర్ డైరక్టర్ అభయ్ కరండీకర్ చెప్పారు. దాదాపు 30,000 యూనిట్లు తయారు చేయాలనుకుంటున్నామని, త్వరలో ఇవి మార్కెట్‌కు వస్తాయని చెప్పారు