ఇసుక అక్రమాలపై వైసిపిలో ముసలం 

అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ఇంకా ఇసుకను సక్రమంగా అందుబాటులోకి తీసుకు రాలేక పోవడంతో సొంత పార్టీ ఎమ్యెల్యేలే అసహనానికి గురవుతూ ఉండడం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆందోళన కలిగిస్తున్నది. పలువురు పార్టీ ఎమ్యెల్యేలు ఈ విషయమై మీడియా ముందుకు వచ్చి ఆందోళనలు వ్యక్తం చేయడం సహితం ఖంగారు కలిగిస్తున్నది. 

గతంలో తెలుగు దేశం పార్టీ పాలనలో ఆ పార్టీ ఎమ్యెల్యేలు ఇసుక మాఫియా సామ్రాజ్యం నడుపుతూ సామాన్యులకు ఇసుకను అందుబాటులో లేకుండా చేశారని, భారీ కుంభకోణానికి పాల్పడ్డారని స్వయంగా జగన్ ఆరోపణలు చేయడం తెలిసిందే. 

టిడిపి ప్రభుత్వానికి ఇసుక మాఫియా కారణంగా ప్రజలలో చెడ్డ పేరు రావడంతో ఆ విషయం నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చంద్రబాబు నాయుడు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. 

ఇప్పుడు తనతమ  ప్రభుత్వం కూడా అటువంటి ప్రమాదం ఎదుర్కొనబోతున్నదా అన్న కలవరం ప్రస్తుతం అధికార పక్షపు ఎమ్యెల్యేలలోనే కలుగుతున్నది. అధికారంలోకి రాగానే పారదర్శకమైన ఇసుక విధానం తీసుకు రాకుండా కొంతకాలంపాటు ఇసుక రవాణాను నిషేధించడంతో ఇసుక దొరకక నిర్మాణ కార్యకలాపాలు అన్ని ఆగిపోయాయి. దానితో జీవనోపాధి సమస్యలు ఏర్పడ్డాయి. 

కొత్త విధానం తీసుకు వచ్చినా దానిని సక్రమంగా అమలు పరచలేక పోతున్నారు. కృష్ణా నది పక్కన ఉన్నా గుప్పెడు ఇసుక దొరకడం లేదని వైసీపీ వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆవేదన వ్యక్తం చేయడం తెలిసిందే. 

ఇసుక రీచ్‌ల నుంచి స్టాక్ పాయింట్‌లకు అసలు చేరట్లేదని మరో వైసీపీ ఎమ్మెల్యే కీలారి రోశయ్య ధ్వజమెత్తారు. తాజాగా ఇసుకను అందరికి అందుబాటులో ఉంచడంలో ఏపీఎండీసీ విఫలం అయిందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమరిశలు. 

అటు ప్రతిపక్షాలు, ఇటు సొంత పార్టీల నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఖంగారు పడిన జగన్ శుక్రవారం ఉన్నతాధికార సమీక్ష సమావేశం జరిపారు. ఇసుక అక్రమాలకు పాల్పడితే ఎవరైనా సరే సహించేది లేదని తేల్చిచేప్పారు. బల్క్‌ ఆర్డర్‌కు సరైన నిర్వచనం ఇవ్వాలని,  డిపోల్లో ఇసుకను బాగా అందుబాటులో పెట్టాలని సీఎం సూచించారు. 

ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు లేకుండా చూడాలని, బుకింగ్‌ టైం మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 6 గంటలవరకూ ఉంచాలని చెప్పారు. చిన్న చిన్న నదులనుంచి పక్కనే ఆనుకుని గ్రామాలకు ఎడ్లబళ్ల ద్వారా సొంత అవసరాలకు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లడానికి అనుమతించాలని జగన్ ఆదేశించారు