డిపిఆర్ లిచ్చేవరకు గోదావరి ప్రాజెక్టులు ఆపండి 

డిపిఆర్ లు ఇచ్చేవరకు ప్రాజెక్టుల పనులు ఆపాలని గోదావరి నాదీ యాజమాన్య ‌ బోర్డు (జీఆర్ఎంబీ) తెలంగాణను ఆదేశించింది. ఈ నెల 10లోగా డీపీఆర్‌‌ల ఒకటి, రెండు వాల్యూమ్స్‌‌ అయినా బోర్డుకు సమర్పించాలని, కొంత సమయం తీసుకుని మిగతా డీపీఆర్‌‌లు ఇవ్వాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది. 

శుక్రవారం జలసౌధలో జీఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌ చంద్రశేఖర్‌‌ అయ్యర్‌‌ అధ్యక్షతన జరిగిన బోర్డు ఎనిమిదో సమావేశంలో డిపిఆర్‌లు అందింన అనంతరం ఈ నెల 20వ తేదీన మరో సారి ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం జరపాలని నిర్ణయించారు. 

2014 జూన్‌‌ 2 తర్వాత తెలంగాణలో ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా నిర్మించలేదని, కాళేశ్వరం ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుగా గుర్తిస్తూ కేంద్రమే లేఖ రాసిందని, సీడబ్ల్యూసీ, హైడ్రాలజీ, ఫారెస్ట్‌‌ సహా అన్ని రకాల క్లియరెన్స్‌‌లు వచ్చాయని తెలంగాణ స్పష్టం చేసింది. కేంద్రం పాత ప్రాజెక్టుగా గుర్తించినపుడు మళ్లీ ఎలా ఫిర్యాదు చేస్తారని ప్రశ్నించారు. 

సీతారామ, దేవాదుల ఫేజ్‌‌-3, తుపాకులగూడెం, లోయర్‌‌ పెన్‌‌గంగా సహా మిగతా బ్యారేజీలన్నీ పాత ప్రాజెక్టులేనని, వాటి డీపీఆర్‌‌లను ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే  ప్రాజెక్టులను తెలంగాణ ఏర్పడిన తర్వాతే చేపట్టారని, వాటివల్ల దిగువ రాష్ట్రంగా తమకు నష్టం కలుగుతోందని ఏపీ అధికారులు స్పష్టం చేశారు. 

బచావత్​ అవార్డు ప్రకారమే తెలంగాణ ప్రాజెక్టులను నిర్మిస్తోందని, 2014 జూన్‌‌ 2కు ముందు పూర్తయిన ప్రాజెక్టుల డీపీఆర్‌‌లను అడిగే హక్కు ఏపీకి లేదని తెలంగాణ  ఇంజనీర్లు తేల్చిచెప్పారు. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీటిని మళ్లిస్తున్నారని, వాటికి బదులుగా 45 టీఎంసీల నీళ్లు కృష్ణాలో తెలంగాణకు కేటాయించాల్సి ఉందని తెలిపారు. 

ఈ క్రమంలో బోర్డు జోక్యం చేసుకొని ఏ ప్రాజెక్టు నుంచి ఎంత నీటిని తీసుకుంటున్నారనే లెక్కలు బోర్డు వద్ద లేవని, డీపీఆర్‌‌లు ఇస్తే తమకుస్పష్టత రావడంతో పాటు కేంద్ర జలశక్తి శాఖకు ఆ వివరాలు అందజేస్తామని పేర్కొన్నారు. గోదావరిలో నీళ్లను ఏపీ, తెలంగాణ ఏ మేరకు వాడుకున్నాయో గుర్తించేందుకు టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, ఇందుకు సాంకేతిక కమిటీని నియమించాలని నిర్ణయించారు. 

బోర్డు మెంబర్‌‌ అధ్యక్షతన ఏర్పాటు చేసే ఈ కమిటీలో సీడబ్ల్యూసీ, సీడబ్ల్యూపీఆర్‌‌ఎస్‌‌ – పూణే, తెలంగాణ, ఏపీ నుంచి ఒక్కో సభ్యు డు ఉంటారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో చేపట్టే పెద్దవాగు ప్రాజెక్ట్ ఆధునీకరణకు రెండు రాష్ట్రాలు ఓకే చెప్పాయి. అపెక్స్‌‌ సమావేశం కోసం వెంటనే రెండు రాష్ట్రాలు ఎజెండాను అందజేయాలని బోర్డు చైర్మన్ సూచించారు.