డ్రోన్లు ఎగరాలంటే అనుమతి అవసరం 

దేశంలో డ్రోన్ల తయారీ, వినియోగానికి సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది. ‘మానవ రహిత విమాన వ్యవస్థ (యూఏఎస్‌) నిబంధనలు-2020’ పేరిట రూపొందించిన ఈ నిబంధనలపై 30 రోజుల్లోగా అభిప్రాయాలను తెలుపాలని ప్రజలను కోరింది. అనంతరం తుది నిబంధనలను విడుదల చేయనున్నారు. 

అధీకృత తయారీదారు/దిగుమతిదారు ‘డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌' (డీజీసీఏ) అనుమతించిన వ్యక్తులు, సంస్థలకు మాత్రమే ఇకపై డ్రోన్లను విక్రయించేలా నిబంధనల్లో ప్రతిపాదించారు. లాక్‌డౌన్‌ కారణంగా డ్రోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో ఈ ముసాయిదా నిబంధనలను విడుదల చేశారు. 

 తాజా నిబంధనల ప్రకారం..

  • ప్రతి ఒక్క డ్రోన్‌ తయారీదారు, దిగుమతిదారు, విక్రయదారు, యజమాని, నిర్వహణదారు తప్పనిసరిగా డీజీసీఏ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 
  • యూఏఎస్‌ తయారీ/నిర్వహణ కేంద్రాన్ని తనిఖీ చేసే అధికారం డీజీసీఏకు ఉంటుంది. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ లేని యూఏఎస్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడడానికి వీల్లేదు.
  • డీజీసీఏ అనుమతి ఉన్నవి తప్ప మిగిలిన యూఏఎస్‌లు పేలోడ్లను తీసుకెళ్లకూడదు. 
  • సాధారణంగా 250 గ్రాముల కంటే తక్కువ బరువున్న నానో డ్రోన్లకే దేశంలో అనుమతి ఉందని, అయితే అంతకంటే ఎక్కువ బరువున్న డ్రోన్లను వినియోగించేందుకు ‘క్వాలిఫైడ్‌ రిమోట్‌ పైలట్‌'లకు మాత్రమే అనుమతించనున్నట్లు నిబంధనల్లో పేర్కొన్నారు. 
  • డ్రోన్‌ పోర్టుల ఏర్పాటుపై ముసాయిదాలో ప్రస్తావించారు. 

మూడు క్యాటగిరీలుగా

‘ఇప్పటివరకు యూఏఎస్‌లకు ఎలాంటి నిబంధనలు లేవు. ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్ట్‌ కింద అవి భాగంగా ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ల వ్యవస్థ మొత్తం నూతన నిబంధనల పరిధిలోకి వస్తుంది. ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని త్వరలోనే నిబంధనలను ఖరారుచేస్తాం’ అని విమానయాన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. డ్రోన్ల ద్వారా ఈ-కామర్స్‌ ఉత్పత్తులను చేరవేయడం ఇప్పుడిప్పుడే సాధ్యం కాకపోయినా, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలకు వీటిని వినియోగించవచ్చని తెలిపారు. 

ఈ-కామర్స్‌ ఉత్పత్తులకు, ఎయిర్‌ ట్యాక్సీలకు అనుమతించనున్నట్టు చెప్పారు. యూఏఎస్‌లను మూడు భాగాలుగా విభజించారు. రిమోట్లీ పైలెటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌, మోడల్‌ రిమోట్లీ పైలెటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌, అటానమస్‌ అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌గా వాటిని వర్గీకరించారు. అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను బరువు ఆధారంగా వివిధ క్యాటగిరీలుగా విభజించారు.