అమిత్‌పటేల్‌పై యుకె ఐదేళ్ల నిషేదం

భారత సంతతికి చెందిన ఫార్మా అధినేత అమిత్‌ పటేల్‌ (45)పై యూకే ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఈ కాలంలో ఆయన యుకెలోని మరే కంపెనీలోనూ డైరెక్టర్‌ హౌదాలో కొనసాగడానికి వీల్లేదు.

ఔషధ ధరల విషయంలో చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కేసులో బ్రిటన్‌లోని కాంపిటీషన్‌ అండ్‌ మార్కెట్స్‌ అథారిటీ (సిఎంఎ) అమిత్‌ పటేల్‌ను దోషిగా తేల్చి ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. 

కంపెనీల డైరెక్టర్లు కాంపిటీషన్‌ చట్టంలోని నిబంధనలను పాటించాల్సిన బాధ్యత ఉంటుందని, ప్రజల్ని రక్షించడానికి సిఎంఎ ముందుకొస్తుందని సిఎంఎ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మైఖెల్‌ గ్రెన్‌ఫెల్‌ స్పష్టం చేశారు. మేనేజ్‌మెంట్‌ స్థానాల్లో ఉన్నవా రు చట్టాన్ని అతిక్రమించి వినియోగదారుల అవసరాలను తమకు అనుకూలంగా మార్చుకుంటే సిఎంఎచూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. 

అమిత్‌పటేల్‌పై తీసుకున్న చర్యలే ఇందుకు నిదర్శనమని మైఖెల్‌ తెలిపారు. సెప్టెంబరు 2014 నుంచి మే 2015 వరకు అడెన్‌ మెకెంజీకి అమిత్‌ పటేల్‌ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సమయంలో కింగ్‌ ఫార్మాస్కూటికల్స్‌తో కలిసి నార్ట్రిప్టిలైన్‌ ఔషదం సరఫరాలో అవకతవకలకు పాల్పడినట్లు సిఎంఎ గుర్తించింది.

పోటీ తక్కువగా ఉండేందుకు ఈ ఔషదంపై రెండు సంస్థలు కలిసి తక్కువ పరిమాణం, ధర విషయంలో ఒప్పందం చేసుకున్నాయని, దీంతో వినియోగదారులు తీవ్రంగా నష్టపోయారని తెలిపింది. 

అలాగే 1 మార్చి 2016 నుంచి అక్టోబరు 19 వరకు అమిల్కో ఫార్మా డైరెక్టర్‌గా కొనసాగిన సమయంలోనూ అమిత్‌ ఇటువంటి అవకతవలకే పాల్పడినట్టు రుజువైంది. దీనిని తీవ్రంగా పరిగణించిన సిఎంఎ అమిత్‌ పటేల్‌పై ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.