కాంగ్రెస్ కు నాదెండ్ల మనోహర్ రాజీనామా

ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో వలసలు ఊపండుకొంటున్నాయి. ఆ పార్టీకి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్ లేదని గ్రహిస్తున్న నేతలు ఒకరికోక్కరు తమ దారి చూసుకొంటున్నారు.

తాజాగా, కాంగ్రెస్‌కు మాజీ స్పీకర్, ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌ రాజీనామా చేశారు. కొన్నాళ్లకు పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న నాదెండ్ల పార్టీనీ వీడే అంశంపై అనుచరులతో చర్చించారు. ఈ మధ్యనే విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు.

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కుమారుడైన మనోహర్ 2004, 2005 ఎన్నికలలో తెనాలి నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందారు. అయితే గత ఎన్నికలలో ఓటమి చెందారు. అప్పటి నుండి దాదాపుగా రోజువారి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

చివరికి ఇప్పుడు జనసేనలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. నేడు తిరుపతిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నట్లు తెలిసింది. దీంతో జనసేన తరపున తెనాలి నుంచి మనోహర్ పోటీ చేసే అవకాశమున్నట్లు భావిస్తున్నారు.

2009 లో ఉమ్మడి ఎపి శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన ఆయన స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే, ఆయన స్థానంలో స్పీకర్ గా ఎన్నికయ్యారు.