ఎనిమిదేళ్లలో 750 పులుల మృతి 

దేశంలో పులుల జనాభా వేగంగా పడిపోతున్నదా? వేట, ఇతర కారణాల వల్ల గత ఎనిమిదేళ్లలో దేశంలో 750 పులులు మృతి చెందినట్లు వెల్లడైనది. ఎక్కువగా మధ్యప్రదేశ్‌లో 173 వరకు పులులు మృతి చెందాయని అధికారిక డేటా వెల్లడించింది. 

ఈ మరణాల్లో 369 సహజ కారణాల వల్ల కాగా, వేటాడడం వల్ల 168, పర్యవేక్షణలో 70,అసహజంగా ప్రమాదాలు, సంఘర్షణల్లో 42 మరణాలు సంభవించాయి. 

2012-19 మధ్య కాలంలో 101 పెద్ద పులులను నిర్బంధించారని నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అధారిటీ (ఎన్‌టిసిఎ) పాత్రికేయులు ఒకరు సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు వివరాలు తెలియచేసింది. గత నాలుగేళ్లలో పులుల సంఖ్య 2226 నుంచి 2976కు అంటే 750 వరకు పెరిగిందని గత డిసెంబర్‌లో కేంద్ర పర్యావరణ, అటవీ, మంత్రి ప్రకాష్ జవదేకర్ రాజ్యసభలో వెల్లడించారు. 

దేశం మొత్తం మీద మధ్యప్రదేశ్‌లో 526 వరకు పులులు ఉన్నాయి. మరణాల్లో మధ్యప్రదేశ్ తరువాత రెండోస్థానం మహారాష్ట్రలో 125 పెద్ద పులులు చనిపోయాయి. తరువాత కర్నాటకలో 111,ఉత్తరాఖండ్‌లో 88, తమిళనాడు, అస్సోంలో 54 వంతున, కేరళ, ఉత్తరప్రదేశ్‌లో 35 వంతున, రాజస్థాన్‌లో 17, బీహార్, పశ్చిమబెంగాల్‌ల్లో 11వంతున, చత్తీస్‌గఢ్‌లో 10 వరకు పులులు మృతి చెందాయి.

ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో ఏడేసి వంతున, తెలంగాణలో ఐదు, ఢిల్లీ, నాగాలాండ్‌లో రెండేసి వంతున హర్యానా, గుజరాత్‌లో ఒక్కొక్కటి వంతున పులులు చనిపోయాయి. అదృశ్యమైన పులుల వివరాలు మాత్రం లభ్యం కాలేదు. 

వేట, తదితర కారణాలతో పులులు ఎక్కువ సంఖ్యలో చనిపోవడం ఆందోళన కలిగించే విషయమని, వేటగాళ్ల నుంచి వాటిని రక్షించే చర్యలు విస్తృతం చేయాలని భోపాల్‌కు చెందిన వన్యప్రాణుల ఉద్యమనేత అజయ్‌దుబే ప్రభుత్వాన్ని కోరారు.