ఫామ్ హౌజ్ పై కేటీఆర్ కు ఎన్జీటీ నోటీసు 

రంగారెడ్డి జిల్లాలోని జన్వాడ దగ్గర  ఫామ్ హౌజ్ నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ కు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నోటీసులు జారీ చేసింది. జన్వాడలో 111 జీవోకు విరుద్ధంగా కేటీఆర్ ఫామ్ హౌజ్ నిర్మించారని ఎన్జీటీ లో   కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ వేశారు.  

దీంతో రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ ఎం డి ఎ లకు నోటీసులు ఎన్జీటీ జారీ చేసింది. అంతేగాక, ఫామ్ హౌజ్ నిర్మాణంపై కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలో ఓ నిజనిర్ధారణ కమిటీని కూడా నియమించింది.

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, జి హెచ్ ఎం సి, వాటర్ వర్క్స్, హెచ్ హెమ్ డి ఎ అధికారులతో పాటు రంగారెడ్డి కలెక్టర్ లను  కమిటీలో సభ్యులుగా చేర్చింది. 2018లో 111 జీవోను పూర్తిగా అమలు చేయాలంటూ ప్రభుత్వం  ఇచ్చిన తీర్పు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో రెండు నెలల్లోనివేదిక ఇవ్వాలని కమిటీ ఆదేశించింది.  

మంత్రి కేటీఆర్ జన్వాడ ఫామ్‌ హౌస్ ముట్టడి కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని గతంలో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు అక్కడికి వెళ్లిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డిని కూడా అప్పట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

గండిపేట చెరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంతం 111 జీవో పరిధిలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టారని రేవంత్ విమర్శించారు.